ఉత్తరప్రదేశ్‌లోని,ముజఫర్‌నగర్‌లో అద్భుత సంఘటన జరిగింది. 30 ఏళ్ల క్రితం చని పోయాడని భావిస్తున్న వ్యక్తి ఊహించని విధంగా కళ్ల ముందు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తొలుత అస్సలు నమ్మలేదు.ఈ తరువాత కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఖతౌలి పట్టణంలోని మొహల్లా బల్కారాం నివాసి షరీఫ్ 28 ఏళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులకు అందుబాటులో లేకుండా పొయ్యాడు. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో షరీఫ్ అధికారిక పత్రాలకోసం 1997 తరువాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అకస్మాత్తుగా వృద్ధుడైన షరీఫ్ ప్రత్యక్షం కావడంతో బంధువులు, పొరుగు వారు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం షరీఫ్ మొదటి భార్య 1997లో మరణించింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని భార్యతో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాడు. ప్రారంభంలో ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేవాడు. అయితే, కాలక్రమేణా అవీ ఆగిపోయాయి. అతను ఇచ్చిన అడ్రస్‌లో షరీఫ్‌ను సంప్రదించాలని ప్రయత్నించిన బంధువులకు నిరాశే ఎదునైంది. దీంతో అతను చనిపోయాడని భావించారు. అయితే ఎస్‌ఐఆర్ పుణ్యమా అని రెండు రోజుల క్రితం షరీఫ్ ఖతౌలికి తిరిగి వచ్చాడు. తొలుత ఎవరూ నమ్మలేదు. షరీఫ్ తిరిగి వచ్చాడన్న సమాచారంతో స్థానికంగా సందడి నెలకొంది. ఇరుగు పొరుగువారు, బంధువులు, పరిచయస్తుంతా గుమిగూడారు, దూరపు చుట్టాలు వీడియో కాల్స్ చేసి మురిసి పోయారు.
ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
గత 15, 20 ఏళ్లుగా అతని కోసం ఎంత వెదికినా ఫలితంలేదని మేనల్లుడు మొహమ్మద్ అక్లిమ్ తెలిపారు. అయితే రెండో పెళ్లి తరువాత ఆర్థిక పరిస్థితి, కమ్యూనికేషన్ సదుపాయం లేక పోవడం వల్ల తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని షరీఫ్ చెప్పుకొచ్చాడు. ఇపుడు ప్రభుత్వ పత్రాలు అవసరం కాబట్టి తిరిగి వచ్చానని, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతానని కూడా చెప్పాడు. అన్నట్టుగానే సంబంధిత పత్రాలను తీసుకొని బెంగాల్‌కు వెళ్లిపోయాడు.


