యూఎస్‌ఏ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో వివాదాస్పద ఎంపికలు జరిగినట్లు తెలుస్తుంది. సెలక్షన్ కమిటీ పాత్ర లేకుండా కోచ్ పుబుడు దసనాయకే, కెప్టెన్ మోనాంక్ పటేల్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.
మెగా టోర్నీ కోసం జట్టును అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పలువురు ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ప్రమేయం లేకుండానే ఎంపిక చేశారని ఓ అమెరికా సీనియర్ జర్నలిస్ట్ తెలిపారు.
స్థానికంగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే శ్రీలంక బ్యాటర్ షేహాన్ జయసూర్యకు నేరుగా ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించారని తెలుస్తుంది. పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఎహ్సాన్ అదిల్‌ను కూడా అర్హత ప్రామాణాలు చూడకుండా జట్టులోకి తీసుకున్నారని సమాచారం.
యూఎస్‌ఏ హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్ పుబుడు దసనాయకే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారని స్థానిక మీడియా అంటుంది. జట్టు ఎంపికలో కోచ్ పాత్రను పరిమితం చేయాలని జర్నలిస్ట్‌లు యూఎస్‌ఏ క్రికెట్ బోర్డుకు సూచిస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న లీకుల ప్రకారం.. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్ (ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8) కోసం ఎంపిక చేసిన 18 మంది సభ్యుల యూఎస్‌ఏ జట్టు ఇలా ఉంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా మోనాంక్ పటేల్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా జెస్సీ సింగ్ ఎంపికయ్యాడు.
మాజీ పాకిస్తాన్ ఆటగాడు ఎహ్సాన్ అదిల్, మాజీ శ్రీలంక బ్యాటర్ షేహాన్ జయసూర్య, లెగ్ స్పిన్నర్ మహ్మద్ మొహ్సిన్, మహారాష్ట్రలో (భారత్) జన్మించిన MLC స్టార్ శుభమ్ రంజనేమ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ మరియు అసిస్టెంట్ కోచ్‌ను నియమించినట్లు తెలుస్తుంది.
కోచ్ పుబుడు దసనాయకే ప్రోద్బలంతో మాజీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దమ్మిక ప్రసాద్‌కు ఆ పదవి కట్టబెట్టారని సమాచారం.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన యూఎస్‌ఏ జట్టు (లీకుల ప్రకారం)..
మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్ (వైస్ కెప్టెన్), ఎహ్సాన్ అదిల్, ఆండ్రీస్ గౌస్, షయాన్ జహంగీర్, షేహాన్ జయసూర్య, ఆరోన్ జోన్స్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్, సంజయ్ కృష్ణమూర్తి, మిలింద్ కుమార్, మహ్మద్ మొహ్సిన్, సాయి ముక్కమల్లా, సౌరభ్ నేత్రవల్కర్, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, రుషిల్ ఉగర్కర్, షాడ్లీ వాన్ స్కాల్క్విక్.
కాగా, 2026 టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో యూఎస్‌ఏతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో యూఎస్‌ఏ తమ తొలి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 7) భారత్‌ను ఢీకొంటుంది. అనంతం ఫిబ్రవరి 10న పాకిస్తాన్, 13న నెదర్లాండ్స్, 15న నమీబియాతో పోటీపడనుంది.


