మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర'.. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఆ సమయంలో గేమ్ ఛేంజర్ కోసం చిరు వాయిదా వేసుకున్నారు. అపై టీజర్ విషయంలో ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ చెందడంతో వాయిదానే బెటర్ అనుకున్నారు. అందులో గ్రాఫిక్స్ వర్క్ చాలా పేలవంగా ఉందని విమర్శలు రావడంతో మార్పులు చేయాలనుకున్నారు. అయితే, ఎప్పుడు రిలీజ్ అనేది ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇంతలో 'మన శంకర వరప్రసాద్ గారు' లైన్‌లోకి వచ్చేశాడు. మరో పదిరోజుల్లో విడుదల కూడా కానుంది. కానీ, విశ్వంభర గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.
'విశ్వంభర' టీజర్ విషయంలో విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠ పక్కా ప్లాన్‌తో ఈ ఏడాది మొత్తం విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ కోసం కేటాయించి బలమైన ఔట్‌పుట్‌ను ఇచ్చారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్‌పై విస్తృతంగా పరిశీలించి అనేక మార్పులు చేశారట. అయితే, తాజా నివేదికల ప్రకారం 'విశ్వంభర' జూన్ 2026 విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 2026లో వస్తున్నందున, రెండు విడుదలల మధ్య ఆరోగ్యకరమైన అంతరాన్ని కొనసాగించాలని మేకర్స్ ఉన్నారట. విశ్వంభర తుది అవుట్‌పుట్‌ను మెగాస్టార్ ఆమోదించిన తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే టాప్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు విశ్వంభర కోసం పనిచేస్తున్నాయి. ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించాలని వశిష్ఠ తన ప్లాన్ మార్చుకున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.


