సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA)కు చేదు అనుభవం ఎదురైంది. సఫారీలు విధించిన 124 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. ఫలితంగా 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.
గంభీర్ ప్రయోగాలు
కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసింది. ఇంగ్లండ్ పర్యటన, వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టుల్లో మూడో స్థానంలో ఆడించిన సాయి సుదర్శన్‌ను తుదిజట్టు నుంచి తప్పించింది.
సాయికి బదులుగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేసింది. వన్‌డౌన్‌లో అతడిని ఆడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 82 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది వాషీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.
వాషీ పర్లేదు
ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా వాషీ కాస్త మెరుగ్గా రాణించాడు. సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ వాషీ.. 92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. అయితే, మార్క్రమ్ బౌలింగ్‌లో హార్మర్‌కు క్యాచ్ ఇవ్వడంతో వాషీ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.
గిల్ స్థానంలో జురెల్
ఈ మ్యాచ్‌లో మరో ప్రయోగం... ధ్రువ్ జురెల్‌ను నాలుగో స్థానంలో ఆడించడం. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మెడనొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో జురెల్‌ను ప్రమోట్ చేశాడు హెడ్‌కోచ్ గౌతం గంభీర్. అయితే, కాసేపు క్రీజులో నిలబడ్డా జురెల్.. వాషీ మాదిరి పరుగులు చేయలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.
ఇక ఐదో నంబర్ బ్యాటర్ రిషభ్ పంత్ 13 బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసి.. అవుటయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన జడ్డూ.. హార్మర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.
గెలుపు ఆశలు రేపిన అక్షర్
మరోవైపు టెయిలెండర్ కుల్దీప్ యాదవ్ 13 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి హార్మర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. అక్షర్ పటేల్ గెలుపు ఆశలు రేపాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో సత్తా చాటాడు.
Pressure? What pressure? 🔥#AxarPatel takes the attack to the South African bowlers! 🏏👏#INDvSA | 1st Test, Day 3, LIVE NOW 👉 https://t.co/19cUrY4aXc pic.twitter.com/zpiIumJibl
— Star Sports (@StarSportsIndia) November 16, 2025
అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అతడు.. ఆఖరికి అతడి బౌలింగ్‌లో (34.5)నే బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్.. మరుసటి బంతికే సిరాజ్ అవుట్ కావడంతో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇక గిల్ ఆబ్సెంట్ హర్ట్ (0) కావడంతో.. ఆలౌట్ అయిన భారత్ ఓటమి ఖరారైంది.
టాస్ గెలిచిన.. తొలుత బ్యాటింగ్
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు, కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్‌తో సత్తా చాటారు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది.
ఇందుకు బదులుగా టీమిండియా 189 పరుగులతో సమాధానం ఇచ్చింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. సుందర్ 29, పంత్ 27, జడేజా 27 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
తెంబా బవుమా హాఫ్ సెంచరీ
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా హాఫ్ సెంచరీ (55 నాటౌట్) చేయడంతో ప్రొటిస్ జట్టు ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. ఫలితంగా 124 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది.
తప్పని ఓటమి
అయితే, ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా ఆది నుంచే తడ‘బ్యాటు’కు లోనైంది. ఆఖరికి 93 పరుగులకు కుప్పకూలి.. 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ప్రొటిస్ బౌలర్లలో స్పిన్నర్లు హార్మర్ నాలుగు, కేశవ్ మహరాజ్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మార్క్రమ్ ఒక వికెట్ తీశాడు. ఓపెనర్లను అవుట్ చేసి యాన్సెన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హార్మర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా- 159 &153
భారత్- 189 &93.
చదవండి: తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్‌పై గంగూలీ ఫైర్


