2025..టెస్టు క్రికెట్‌లో మరుపురాని ఏడాదిగా మిగిలిపోనుంది. సౌతాఫ్రికా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలవడం నుంచి.. ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ విజయం వరకు ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో సౌతాఫ్రికా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడంతో పాటు టీమిండియాను వారి సొంత గడ్డపైనే 2-0తో వైట్‌వాష్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. టెంబా బావుమా నాయకత్వంలో సౌతాఫ్రికా జట్టు తిరుగులేని జట్టుగా అవతరించింది.
27 ఏళ్ల నిరీక్షణకు తెర..
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్ 2023-25లో సౌతాఫ్రికా వరుస సిరీస్ విజయాలతో ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టు ఉండడంతో సఫారీలకు ఓటమి తప్పదని భావించారు. కానీ టెంబా బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా అందరి అంచనాలను తారుమారు చేసింది.
లార్డ్స్ వేదికగా జరిగిన తుదిపోరులో కంగారులను చిత్తు చేసిన సౌతాఫ్రికా జట్టు.. తాము చోకర్స్ కాదు టైగర్స్ అని నిరూపించుకుంది. ఈ విజయంతో తమ 27 ఏళ్ల నిరీక్షణకు సఫారీలు తెరదించారు. 1996 తర్వాత సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఐడెన్ మార్క్రామ్ (136) వీరోచిత శతకంతో జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.
టీమిండియాకు ఘోర పరాభవం..
అనంతరం ఈ ఏడాది నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చిన సఫారీలు సరికొత్త చరిత్ర సృష్టించారు. టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఉపఖండంలో తిరుగులేని జట్టుగా ఉన్న భారత్‌కు ప్రోటీస్ ఊహించని షాకిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పోరాడి 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్.. గౌహతి టెస్టులో అయితే ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాభావన్ని మూట కట్టకుంది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. సౌతాఫ్రికా జట్టులో కెప్టెన్ బవుమాతో పాటు మార్కో జాన్సెన్, మార్‌క్రమ్, కేశవ్ మహారాజ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.
బవుమా ది గ్రేట్..
సౌతాఫ్రికా జైత్ర యాత్ర వెనక కెప్టెన్ బవుమాది కీలక పాత్ర. బవుమా తన అద్భుత కెప్టెన్సీతో దశాబ్దాలుగా వెంటాడుతున్న 'చోకర్స్' ముద్రను చెరిపేస్తూ.. ప్రపంచ క్రికెట్‌కు సౌతాఫ్రికా సత్తా చూపించాడు. 2022లో సౌతాఫ్రికా టెస్టు జట్టు బాధ్యతలు చేపట్టిన బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా 12 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో 11విజయాలు, ఒక్క డ్రా ఉంది. అదేవిధంగా ఈ ఏడాదిలో 8 టెస్టులు ఆడిన సౌతాఫ్రికా ఆరింట విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా కాగా.. మరో మ్యాచ్‌లో ప్రోటీస్ ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌గా మార్‌క్రమ్ వ్యవహరించాడు.
బెస్ట్ టీమ్ కెప్టెన్‌గా..
అందుకే బవుమాకి క్రికెట్ ఆస్ట్రేలియా అరుదైన గౌరవమిచ్చింది. ఈ ఏడాది ముగింపు సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 'బెస్ట్ టెస్ట్ ప్లెయింగ్ ఎలెవన్' ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా బవుమాను సీఎ ఎంపిక చేసింది. తమ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను కాకుండా బవుమాను ఎంపిక చేయడం గమనార్హం. అదేవిధంగా ఈ జట్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్, బెన్ స్టోక్స్.. సౌతాఫ్రికా నుంచి బవుమాతో పాటు సైమన్ హర్మర్‌కు చోటు దక్కింది. ఆసీస్ నుంచి అలెక్స్ కారీ, స్కాట్ బోలాండ్‌ను ఎంపిక చేశారు.
క్రికెట్ ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, ట్రావిస్ హెడ్, జో రూట్, శుభ్‌మాన్ గిల్, టెంబా బావుమా (కెప్టెన్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, జస్‌ప్రీత్ బుమ్రా, స్కాట్ బోలాండ్, సైమన్ హార్మర్, రవీంద్ర జడేజా (12వ ఆటగాడు)


