అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యంత రసవత్తర సమరం టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి. రెండు జట్లు ఒక్క పట్టాన ఓటమిని అంగీకరించలేదు. అంతిమంగా సౌతాఫ్రికానే పైచేయి సాధించినప్పటికీ.. ఆఫ్ఘన్ తమ వీరోచిత పోరాటంతో యావత్ క్రికెట్ ప్రపంచం మనసులు గెలుచుకుంది.
తొలుత రెగ్యులర్ మ్యాచ్‌లో స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు చివరి బంతి వరకు పోరాడాయి. ఫైనల్‌గా సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి విజయం సాధించింది.
రెగ్యులర్ మ్యాచ్
సౌతాఫ్రికా 187-6 (20 ఓవర్లు)
ఆఫ్ఘనిస్తాన్ 187-10 (19.4 ఓవర్లు)
ఫ్రీ హిట్‌కు రనౌట్
రెగ్యులర్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపును కాలదన్నుకుంది. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు ప్రయత్నంలో రనౌట్ రూపంలో వికెట్ కోల్పోయింది. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే ఆ బంతి ఫ్రీ హిట్. ఆఫ్ఘన్ కోల్పోయి వికెట్ చివరిది. దీంతో ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే ఒక్క పరుగు చేయలేక చేతుల్లోకొచ్చిన గెలుపును వదిలేసుకుంది.
తొలి సూపర్ ఓవర్
ఆఫ్ఘనిస్తాన్- 4, 6, 1, 1, 4, 1 (17 పరుగులు)
సౌతాఫ్రికా- 1, 6, W, 4, 0, 6 (17 పరుగులు)
రెండో సూపర్ ఓవర్
సౌతాఫ్రికా- 6, 1, 2, 6, 6, 2 (23 పరుగులు)
ఆఫ్ఘనిస్తాన్- 0, W, 6, 6, 6, Wd1, W (19 పరుగులు)
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాను 187 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కెప్టెన్ రషీద్ ఖాన్ (4-0-28-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (4-0-41-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. ఫజల్ హక్ ఫారూకీ (4-0-32-1) పర్వాలేదనిపించాడు.
ముజీబ్ ఉర్ రెహ్మాన్ (3-0-30-0), మొహమ్మద్ నబీ (2-0-20-0), నూర్ అహ్మద్ (3-0-25-0) వికెట్లు తీయలేకపోగా.. పరుగులు దండిగా సమర్పించుకున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (59), ర్యాన్ రికెల్టన్ (61) అర్ద సెంచరీలతో రాణించారు. డెవాల్డ్ బ్రెవిస్ (23), డేవిడ్ మిల్లర్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ మార్క్రమ్ (5), స్టబ్స్ (1) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఆఖర్లో జన్సెన్ (16) బ్యాట్ ఝులిపించాడు.
188 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (84) చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా, తన జోరును తగ్గించకుండా ఆఫ్ఘన్‌ను లక్ష్యం వైపు తీసుకెళ్లాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (22), రషీద్ ఖాన్ (20), నూర్ అహ్మద్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆఫ్ఘన్ స్కోర్లు సమం చేసుకొని, లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.
మిగతా ఆఫ్ఘన్ ఆటగాళ్లలో ఇబ్రహీం జద్రాన్ 12, దర్విష్ రసూల్ 15, నబీ 5 పరుగులు చేయగా.. గుల్బదిన్ నైబ్, సెదిఖుల్లా అటల్, ముజీబ్, ఫజల్ హక్ డకౌట్లయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీసి ఆఫ్ఘన్‌కు గెలుపును దూరం చేశాడు. జన్సెన్, రబాడ, లిండే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ తీశారు.


