T20 WC 2026: కివీస్‌ ఓపెనర్ల ప్రపంచ రికార్డు | T20 WC: Finn Allen Tim Seifert create history Become 1st players in world to | Sakshi
Sakshi News home page

T20 WC 2026: కివీస్‌ ఓపెనర్ల ప్రపంచ రికార్డు

Feb 11 2026 12:25 PM | Updated on Feb 11 2026 12:41 PM

T20 WC: Finn Allen Tim Seifert create history Become 1st players in world to

టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ‌లో న్యూజిలాండ్‌ రికార్డు విజయం సాధించింది. చెన్నై వేదికగా మంగళవారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)తో తలపడింది కివీస్‌. చిదంబరం స్టేడియంలో జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లోయూఏఈని ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.  

ఓపెనర్లు సత్తా చాటడంతో న్యూజిలాండ్‌కు ఈ విజయం సాధ్యమైంది. వరల్డ్‌కప్‌ టోర్నీ తాజా ఎడిషన్‌ తొలి పోరులో అఫ్గనిస్తాన్‌ను ఓడించిన న్యూజిలాండ్‌కు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. తద్వారా సూపర్‌ ఎయిట్‌కు కివీస్‌ మరింత చేరువైంది.

77 బంతుల్లోనే 107 పరుగులు
కాగా న్యూజిలాండ్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది యూఏఈ. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్‌‌ ముహమ్మద్‌ వసీమ్‌ (45 బంతుల్లో 66 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), అలీషాన్‌ షరఫు (47 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 77 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు.

మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీకి 2 వికెట్లు తీయగా.. జేకబ్‌ డఫీ, లాకీ ఫెర్గూసన్‌, కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

 ప్రపంచ రికార్డు 
అనంతరం న్యూజిలాండ్‌ 15.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 175 పరుగులు సాధించింది. ఓపెనర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ టిమ్‌ సీఫెర్ట్‌, ఫిన్‌ అలెన్‌  ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.

సీఫెర్ట్‌ 42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 89 పరుగులు.. అలెన్‌ 50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 84 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

తద్వారా తొలి వికెట్‌కు 92 బంతుల్లోనే 175 పరుగులు జత చేసి చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఏ వికెట్‌కైనా అత్యధిక స్కోరు సాధించిన జోడీగా సీఫెర్ట్‌- అలెన్‌ ప్రపంచ రికార్డు సాధించారు. తమ అద్భుత ప్రదర్శనతో మరో 27 బంతులు మిగిలి ఉండగానే యూఏఈపై జట్టుకు విజయం అందించారు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక భాగస్వామ్యం (ఏ వికెట్‌కైనా)
🏏టిమ్‌ సీఫెర్ట్‌- ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌): 2026లో యూఏఈ మీద 175 నాటౌట్‌
🏏జోస్‌ బట్లర్- అలెక్స్‌ హేల్స్‌ (ఇంగ్లండ్‌): 2022లో టీమిండియా మీద 170 నాటౌట్‌
🏏క్వింటన్‌ డికాక్‌- రిలీ రొసోవ్‌ (సౌతాఫ్రికా): 2022లో బంగ్లాదేశ్‌ మీద 168 
🏏మహేళ జయవర్దనే- కుమార్‌ సంగక్కర (శ్రీలంక): 2010లో వెస్టిండీస్‌ మీద 166
🏏ఇబ్రహీం జద్రాన్‌- రహ్మనుల్లా గుర్బాజ్‌ (అఫ్గనిస్తాన్‌): 2024లో ఉగాండా మీద 154

న్యూజిలాండ్‌ వర్సెస్‌ యూఏఈ స్కోర్లు
👉యూఏఈ: 173/6(20)
👉న్యూజిలాండ్‌: 175/0(15.2)
👉ఫలితం: యూఏఈపై పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ జయభేరి.

చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్‌!.. ఈసారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement