బరోడా చేతిలో ఓడిన హైదరాబాద్
‘శత’క్కొట్టిన కృనాల్, నిత్య, అమిత్
రాజ్‌కోట్: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్... వరుసగా నాలుగో పోరులోనూ పరాజయం పాలైంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం పరుగుల వరద పారిన పోరులో బరోడా 37 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. మొదట బరోడ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది.
కెప్టెన్ కృనాల్ పాండ్యా (63 బంతుల్లో 109 నాటౌట్; 18 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో విజృంభించగా... ఓపెనర్లు నిత్య పాండ్యా (110 బంతుల్లో 122; 12 ఫోర్లు, 1 సిక్స్), అమిత్ పసీ (93 బంతుల్లో 127; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు. ఆఖర్లో భాను పనియా (27 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. హైదరాబాద్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో... బరోడా బ్యాటర్లు పరుగుల పండగ
చేసుకున్నారు.
ఎడాపెడా బౌండరీలు బాదిన బరోడా బ్యాటర్లు... ఈ మ్యాచ్‌లో 44 ఫోర్లు, 11 సిక్స్‌లు కొట్టడం విశేషం. మన బౌలర్లలో చామా మిలింద్ 2 వికెట్లు పడగొట్టగా... తనయ్ త్యాగరాజన్, వరుణ్ గౌడ్ చెరో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్ 49.5 ఓవర్లలో 380 పరుగులకు ఆలౌటైంది. అభిరత్ రెడ్డి (90 బంతుల్లో 130; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రజ్ఞయ్ రెడ్డి (98 బంతుల్లో 113; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది.
అమన్ రావు (39; 6 ఫోర్లు, 1 సిక్స్), తన్మయ్ అగర్వాల్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రెడ్డి (33; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. బరోడా బౌలర్లలో అతిత్ సేత్, మహేశ్ పితియా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అమిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి 5 సెంచరీలు నమోదు చేశారు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్ పాయింట్ల ఖాతా తెరవలేక పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శనివారం చండీగఢ్‌తో హైదరాబాద్ తలపడనుంది. చండీగఢ్ కూడా ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓడింది.


