సాక్షి, హైదరాబాద్: ‘రియల్ ఎస్టేట్’వేగంగా పుంజుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో కీలక మార్పులు చేయనున్నట్టు విశ్వసనీయ సమా చారం. 250 చదరపు అడగుల విస్తీర్ణం కంటే అధిక విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాల్లో సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు భవన నిర్మా ణంలో 10 శాతం మేరకు సదరు స్థానిక సంస్థకు తనఖా పెట్టాలన్నది నిబంధన.
భవనం పూర్తయిన తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చిన అనుమతుల మేరకు నిర్మించారని, ఎలాంటి ఉల్లంఘనలు లేవని తనిఖీల అనంతరం స్థానిక సంస్థలు లేదా పురపాలక సంఘాలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చే యాలి. ఓసీ జారీ చేసిన అనంతరమే తనఖా పెట్టిన ఆ 10 శాతం భవనాన్ని పురపాలక శాఖ బిల్డర్ పేరిట రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే తనఖా పెట్టిన నిర్మిత భవనాన్ని కొనుగోలుదారులకు రిజి స్ట్రేషన్ చేయాలి.
అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన స్థాయిలో పురోగతి లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, క్రెడాయ్ సైతం రాష్ట్ర ప్రభుత్వా నికి తనఖా నిబంధనను తగ్గించాలని విజ్ఞప్తి చేశారని, అందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని అధికార వర్గాల కథనం. ప్రస్తుతం 10 శాతం ఉన్న తనఖా (మార్టిగేజ్) నిబంధనను ఐదు శాతా నికి తగ్గించడానికి అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని పుర పాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు స్థానిక సంస్థలకు అభివృద్ధి పన్ను కింద చెల్లించాల్సిన మొత్తాలు రూ.కోట్లలో ఉండడంతో ఒకేసారి చెల్లించకుండా.. ఆరు వాయిదా పద్ధతుల్లో చెల్లించడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అయితే ఆరు వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని వినియోగించుకున్న పక్షంలో వారు చెల్లించాల్సిన మొత్తం అభివృద్ధి పన్నుపై 5 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ 5శాతం అదనంగా చెల్లించే మొత్తాన్ని రెండున్నర శాతానికి తగ్గించాలని చేసిన విజ్ఞప్తిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.


