జీసీసీ జాబ్స్‌.. సిటీ వైబ్స్‌ | - | Sakshi
Sakshi News home page

జీసీసీ జాబ్స్‌.. సిటీ వైబ్స్‌

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:02 AM

జీసీసీ జాబ్స్‌.. సిటీ వైబ్స్‌

జీసీసీ జాబ్స్‌.. సిటీ వైబ్స్‌

దేశంలోని 20 శాతం జీసీసీలు భాగ్యనగరంలోనే..

ఫ్రెషర్లకు భారీగా ఉద్యోగావకాశాలు.. వేతనాలూ ఎక్కువే

ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సైన్స్‌, డేటా ఇంజినీరింగ్‌ విభాగాల్లో అవకాశాలు

మెరుగైన మౌలిక వసతులు, నిపుణుల లభ్యత ప్రధాన కారణం

సాక్షి, సిటీబ్యూరో: బహుళజాతి సంస్థల గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ల కొలువులకు హైదరాబాద్‌ నెలవుగా మారుతోంది. బహుళజాతి సంస్థలు తమ జీసీసీల ఏర్పాటుకు నగరాన్నే ఎంచుకుంటున్నాయి. గతంలో సామూహిక ప్రాంగణ నియామకాలకు దూరంగా ఉన్న జీసీసీలు ఇప్పుడు క్రమంగా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు చేపడుతున్నాయి. ప్రతిభ, నైపుణ్యమే కొలమానాలుగా ఫ్రెషర్లకు కూడా భారీ వేతనాలు అందిస్తున్నాయి. 2025–2026లో నగరంలో ప్రాంగణ నియామకాల్లో పాల్గొన్న జీసీసీల సంఖ్య దాదాపు 300 శాతం పెరిగింది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో చెల్లించే దాని కంటే జీసీసీ నియామకాల్లో వార్షిక వేతనాలు మెరుగ్గా ఉంటున్నాయి. సగటున రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షలను అందిస్తున్నాయి.

దేశంలో 1,800పైగా జీసీసీలు

ప్రస్తుతం దేశంలో 1,800పైగా జీసీసీలు ఉండగా.. వీటిల్లో సుమారు 21.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కృత్రిమ మేధ(ఏఐ), ఇంజినీరింగ్‌, పరిశోధన, అభివృద్ధి, డిజిటల్‌ నైపుణ్యాలకు భారత్‌ కేంద్రంగా ఉండటంతో 2030 నాటికి జీసీసీల సంఖ్య 2,400లకు, ఉద్యోగుల సంఖ్య 28 లక్షల నుంచి 30 లక్షలకు చేరుతుందని అంచనా.

హైదరాబాద్‌ హాట్‌ ఫేవరేట్‌..

జీసీసీలకు హైదరాబాద్‌ హాట్‌ ఫేవరేట్‌గా మారింది. దేశవ్యాప్తంగా జీసీసీల్లో 20 శాతానికిపైగా మన నగరంలోనే ఏర్పాటయ్యాయి. గ్రేటర్‌లో 355కుపైగా జీసీసీలు ఉన్నాయి. వీటిల్లో 3 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత 12 నెలల్లో 35–50 జీసీసీలు నగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఎవర్‌నార్త్‌ హెల్త్‌ సర్వీసెస్‌, ఓప్‌టమ్‌ గ్లోబల్‌, అలైన్‌ టెక్నాలజీస్‌, హనీవెల్‌, బార్క్‌లెస్‌, హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లపై దృష్టిసారించాయి.

సత్తానే ప్రామాణికం..

గతంలో జీసీసీ కేంద్రాలకు సీఈఓ, సీఐఓలుగా ఆయా కంపెనీల కేంద్ర కార్యాలయాల నుంచిగానీ, ఆ కంపెనీల సొంత దేశాలకు చెందిన వారినిగానీ నియమించటం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. తన, మన అనే తేడా కాకుండా, సత్తా ఉన్నవారినే జీసీసీల్లో ఉన్నత స్థానాలకు ఎంపిక చేసే సంప్రదాయం మొదలైంది. ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, జెనరేటివ్‌ ఏఐ. ఏఐ/ఎంఎల్‌, డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ నైపుణ్యాలు ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఉండటం, తక్కువ జీవన వ్యయం, అనుకూల ప్రభుత్వ విధానాల కారణంగా ఆయా సంస్థలు నగరానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement