ఈవీఎం బటన్‌పై పెర్ఫ్యూమ్.. ఎన్నికల సంఘం సీరియస్ | EC Warns of Repoll in Bengal | Sakshi
Sakshi News home page

ఈవీఎం బటన్‌పై పెర్ఫ్యూమ్.. ఎన్నికల సంఘం సీరియస్

Apr 16 2026 1:33 PM | Updated on Apr 16 2026 2:00 PM

EC Warns of Repoll in Bengal

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లలో అనూహ్య పరిణామాలకు సంబంధించిన బెదిరిపులు వెలుగుచూస్తున్నాయి. ఓటర్లను భయపెట్టేందుకు, నిఘాను తప్పించుకునేందుకు దుండగులు వేస్తున్న కొత్త ఎత్తుగడలు తెలుసుకున్న ఎన్నికల సంఘం (ఈసీ) అవాక్కవుతోంది. ఈవీఎం బటన్లకు పెర్ఫ్యూమ్ పూయడం, వెబ్‌కాస్టింగ్ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటించడం వంటి చర్యలపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని, వెంటనే ఆయా బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

ఓటర్లకు పెర్ఫ్యూమ్ బెదిరింపులు
ఓటర్లను ప్రభావితం చేసేందుకు కొందరు అగంతకులు దారుణమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘మీరు ఏ పార్టీకి ఓటు వేశారో మాకు ఇట్టే తెలిసిపోతుంది, ఎందుకంటే ఈవీఎం బటన్లపై మేము పెర్ఫ్యూమ్ పూస్తాం’ అంటూ ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో రికార్డింగ్ జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటిస్తూ, నిఘా వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం
ఓటర్లను బెదిరించినా, నిఘా వ్యవస్థను ట్యాంపరింగ్ చేసినా రీపోలింగ్ తప్పదని స్పష్టం చేసింది.

విద్యుత్ కోతలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
పోలింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మనోజ్ అగర్వాల్ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా జనరేటర్లను సైతం సిద్ధం చేస్తున్నారు. నెట్‌వర్క్ సమస్యలు ఉన్న డార్జిలింగ్, కాలింపాంగ్ సహా 642 'షాడో జోన్ల'లో వెబ్‌కాస్టింగ్ ఆగకుండా టెలికాం ఆపరేటర్ల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. పోలింగ్‌కు 7 రోజుల ముందే బూత్‌లలో కెమెరాల ఏర్పాటు, 2 రోజుల ముందే లైవ్ వెబ్‌కాస్టింగ్ ప్రారంభం కానుంది.

అడుగడుగునా భారీ భద్రత
ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 152 నియోజకవర్గాల్లో జరిగే తొలి దశ పోలింగ్ కోసం ఏకంగా 2,404 కేంద్ర బలగాల కంపెనీలను మోహరిస్తున్నారు. అత్యధికంగా ముర్షిదాబాద్‌లో 316 కంపెనీలు రంగంలోకి దిగుతుండగా.. ఆ తర్వాత తూర్పు మేదినీపూర్ (273), పశ్చిమ మేదినీపూర్ (272) జిల్లాల్లో భారీగా బలగాలను నియమించారు. ప్రతి పోలింగ్ బూత్‌ వద్ద సాయుధులైన కేంద్ర బలగాలతో పాటు లాఠీలు ధరించిన రాష్ట్ర పోలీసు సిబ్బంది అప్రమత్తంగా కాపలా ఉండనున్నారు.

ఇది కూడా చదవండి: లష్కరే టాప్‌ కమాండర్‌పై దాడి.. పరిస్థితి విషమం
 

Advertisement
 
Advertisement
Advertisement