సీఎం రంగస్వామితో విజయ్ దూత రహస్య భేటీ! | Mystery Late Night Meeting Between CM Rangasamy And Minister Anand Sets Off Political Speculation, More Details Inside | Sakshi
Sakshi News home page

సీఎం రంగస్వామితో విజయ్ దూత రహస్య భేటీ!

Jun 13 2026 1:57 PM | Updated on Jun 13 2026 3:31 PM

Midnight Meet Sparks Intense Puducherry Bypoll Buzz

పుదుచ్చేరి: పుదుచ్చేరి రాజకీయాల్లో అర్ధరాత్రి వేళ జరిగిన ఒక రహస్య సమావేశం ఇప్పుడు సంచలనంగా మారింది. రాబోయే తట్టంచావడి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామితో, తమిళనాడు మంత్రి ఎన్ ఆనంద్ (బుస్సీ ఆనంద్) గురువారం రాత్రి జరిపిన ముఖాముఖి భేటీ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆనంద్.. నేరుగా సీఎం నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరపడం కొత్త పొలిటికల్ ఈక్వేషన్లకు దారితీస్తోంది.

ఉపఎన్నికల వేళ వ్యూహాత్మక భేటీ
ముఖ్యమంత్రి రంగస్వామి గత ఎన్నికల్లో మంగళం, తట్టంచావడి రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. అయితే, ఆయన తట్టంచావడి స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. శాసనసభలో తమ బలాన్ని 12 స్థానాలకు పెంచుకోవాలని భావిస్తున్న అధికార పక్షం ఏఐఎన్‌ఆర్‌సీ, ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇలాంటి కీలక సమయంలో పుదుచ్చేరి మూలాలు ఉన్న బుస్సీ ఆనంద్.. పెళ్లి వేడుక కోసం వచ్చి, అర్ధరాత్రి సీఎం రంగస్వామిని కలవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది.

విజయ్ దళపతి దూతగా బుస్సీ ఆనంద్?
బుస్సీ ఆనంద్ కేవలం తమిళనాడు మంత్రి మాత్రమే కాదు.. గతంలో 2006లో పుదుచ్చేరి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నటుడు, సీఎం విజయ్ అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు. రంగస్వామితో ఆయనకు పాత వ్యక్తిగత, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. గతంలో పుదుచ్చేరి వచ్చినప్పుడు ఆలయ దర్శనం చేసుకుని వెళ్లిపోయిన ఆనంద్, ఈసారి మాత్రం నేరుగా సీఎం రంగస్వామితో  చర్చలు జరపడం వెనుక సీఎం విజయ్ రాయబారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మారుతున్న పొత్తుల సమీకరణలు
తమిళనాడులో టీవీకే  నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ, పుదుచ్చేరిలో పొత్తులపై ఇంకా ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదు. ఒకవేళ పుదుచ్చేరి ఉపఎన్నికలో టీవీకే, కాంగ్రెస్ చేతులు కలిపితే అధికార ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, గత ఎన్నికల్లో టీవీకేతో కలిసి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నేయం మక్కల్ కజగం పార్టీ కూడా ఈ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు బుస్సీ ఆనంద్‌ను సంప్రదించడం ఈ సీటు చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement