అది బీజేపీకి బలమైన కంచుకోట.. వరుస విజయాలతో పార్టీకి అండగా నిలిచిన నియోజకవర్గం. కానీ ఇప్పుడు అదే స్థానంలో ఫలితం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అందుకే బంకీపూర్‌లో పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సాధారణంగా గెలుపు ఖాయంగా భావించే ఈ సీటులో ఈసారి మాత్రం బీజేపీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కారణం.. ఒకవైపు జన సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం.. మరోవైపు జెన్ జీ (Gen Z) విద్యార్థుల ఉద్యమం రాజకీయ చర్చకు కేంద్రంగా మారడం.
బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఈసారి సాధారణ పోరుగా కాకుండా.. బీజేపీ ఆధిపత్యానికి పరీక్షగా మారింది. జులై 30న పోలింగ్ జరగనుండగా.. ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేస్తుండగా.. జన సూరాజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిశోర్ బరిలో ఉన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు బీజేపీ, జన సూరాజ్ మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీజేపీ కంచుకోటలో కొత్త సవాల్
బంకీపూర్ నియోజకవర్గం చాలాకాలంగా బీజేపీకి అనుకూలంగా ఉంది. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే నితిన్ నబీన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తన సంప్రదాయ బలాన్ని నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా తరఫున ప్రచారం చేస్తున్న నితిన్ నబీన్.. ప్రజల్లో పార్టీపై విశ్వాసం కొనసాగుతోందని చెబుతున్నారు. “యువత ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం సామ్రాట్ చౌధరీ, ఎన్డీయేకు మద్దతుగా ఉంది. ప్రజల ఆశీర్వాదం బీజేపీకి కొనసాగుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పీకే ఎంట్రీతో ఆసక్తికర పోరు
రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్.. జన సూరాజ్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సూరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. బంకీపూర్ ఉప ఎన్నిక ఆయనకు కీలక పరీక్షగా మారింది. ఈ ఎన్నిక ద్వారా బిహార్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో జన సూరాజ్ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లు, పట్టణ ప్రాంత ప్రజలు, సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయం కోరుకునే వర్గాలపై ప్రశాంత్ కిశోర్ దృష్టి పెట్టారు.
యువ ఓటర్లే నిర్ణాయక శక్తి
బంకీపూర్ ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. నీట్ వివాదంపై ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమం, ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అటు బిహార్‌లోనూ నీట్ నిరసనల సందర్భంగా కేసులు, అరెస్టుల వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో యువతలో ఈ అంశాలపై ఉన్న అభిప్రాయం ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? అన్న చర్చ మొదలైంది. పరీక్షల పారదర్శకత, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సమస్యలు యువ ఓటర్ల నిర్ణయంలో కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.
జెన్ జీ ఉద్యమ ప్రభావం ఉంటుందా?
జెన్ జీ ఉద్యమ ప్రభావం బంకీపూర్ ఎన్నికలపై ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు. యువత తమకు మద్దతుగానే ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు బలమని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల ఆందోళనలను ప్రస్తావిస్తూ యువతలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జెన్ జీ ఉద్యమం కేవలం నిరసనగానే మిగిలిపోతుందా? లేక ఓటు రూపంలో ప్రభావం చూపుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బంకీపూర్ ఫలితం ఎందుకు కీలకం?
బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం ఒక సీటు గెలుపోటములకే పరిమితం కాదు. బీజేపీ తన కంచుకోటను నిలబెట్టుకుంటుందా? లేక ప్రశాంత్ కిశోర్ జన సూరాజ్ ప్రభావాన్ని చాటుతుందా? అన్నది బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితం బీజేపీ బలాన్ని మాత్రమే కాకుండా.. యువ ఓటర్ల మూడ్, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఉన్న అవకాశాలను కూడా సూచించే అవకాశం ఉంది. అందుకే బంకీపూర్ బైపోల్ ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.


