సంగారెడ్డి : జిల్లాలోని ఇస్నాపూర్‌లో ఒకేసారి నలుగురు పాఠశాల విద్యార్థినులు అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. బీహార్ రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలు ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈనెల 23వ తేదీన యథావిధిగా పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన విద్యార్థినులు, సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి విచారించగా, ఆ రోజు వారు అసలు స్కూల్‌కే రాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు.బాధిత కుటుంబాలు బీహార్‌కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులను కుష్బూ కుమారి (16), మహిమా కుమారి (12), రోజా కుమారి (12), ప్రియా కుమారి (12)లుగా గుర్తించారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


