సాధారణం కన్నా 23.12 శాతం తగ్గనున్న పంటల సాగు
రాష్ట్రంలో 1.07 కోట్ల ఎకరాల్లోనే ప్రధాన పంటలని అంచనా
ఇప్పటి వరకు 73.36 లక్షల ఎకరాల్లో సాగు
గతేడాదితో పోలిస్తే 32 లక్షల ఎకరాల్లో తగ్గుదల
దీంతో ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి లక్షలాది ఎకరాలు బీడు భూములుగానే మారిపోనున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో జలాశయాలు, ప్రాజెక్టులు, కాలువల కింద పొలాలన్నీ ఇప్పటికీ బీళ్లుగానే కనిపిస్తున్నాయి. నిరుటి ఖరీఫ్‌తో పోలిస్తే వరి సాగు ఏకంగా 32 లక్షల ఎకరాలకు పైగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, అందులో ముప్పావు వంతు భూములు బీళ్లుగానే మిగిలే పరిస్థితి. ప్రత్యామ్నాయ పంటల పేరుతో వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రయత్నాలను రైతులు పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. వచ్చే ఆగస్టు 15 వరకు వరి సాగు చేసుకునే అవకాశం ఉందనే కారణంగా రైతులు వేచి చూసే ధోరణితోనే ఎక్కువగా ఉన్నారు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఇతర అధికారులు రోజూ సమీక్షలు నిర్వహిస్తూ, ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తగ్గుతుందంటున్న వ్యవసాయశాఖ
రాష్ట్రంలో సాధారణంగా సాగయ్యే విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి ప్రధాన పంటల సాగు 23.12 శాతం తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి సాగయ్యే 30 లక్షల ఎకరాలు బీళ్లు కానున్నాయి. అయితే ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసినా, ఇతర ప్రాంతాల్లో ఉండి వరి సాగు చేసుకునే రైతులు, కౌలు రైతులు ముందుకు రావడం లేదు. శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు కాగా, గత ఏడాది ఇది 1,39,28,853 ఎకరాలకు చేరింది. అయితే ఈసారి ప్రధాన పంటలు కేవలం 1,07,08,617 ఎకరాల్లోనే సాగవుతాయని అంచనా వేశారు.
మిగిలిన 32,20,233 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటల సాగుకు అవసరమైన నీరు దొరికే పరిస్థితి లేదు. దీంతో సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండదని భావిస్తున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికే పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ వంటి పంటలు వేసే సమయం దాటిపోయింది. ప్రత్యామ్నాయ పంటల కింద పెసర, బొబ్బర్లు, కంది వంటి వాటిని పండించేలా ప్రయత్నిస్తోంది. అయితే ఆగస్టు 15 వరకు వరి నాట్లు వేసుకోవచ్చని భావిస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టడం లేదు.
భారీగా తగ్గనున్న వరి
ఎల్ నినో ప్రభావం అత్యధికంగా వరిపైనే పడుతోంది. గత ఏడాది వానాకాలంలో 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, ఈసారి 38.51 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. ఆగస్టు 15 వరకు మరో 15 లక్షలకు పైగా ఎకరాల్లో నాట్లు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాగే గత ఏడాది 50.70 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి ఈసారి 45.93 లక్షల ఎకరాలకు పరిమితం కానుంది. మొక్కజొన్న కూడా 6.90 లక్షల ఎకరాల నుంచి 6.49 లక్షల ఎకరాలకు తగ్గనుంది.
అయితే, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చేయిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కంది, పెసర, మినుము, జొన్న, సన్‌ఫ్లవర్, ఆముదం, కూరగాయలు వంటి పంటలను మరింత పెంచుతామని అధికారులు నివేదికలు తయారు చేయడం విమర్శలకు తావిస్తోంది. రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో కురిసే వర్షాలే రాష్ట్ర ఖరీఫ్ వ్యవసాయాన్ని నిర్ణయించనున్నాయి.


