స్థానిక అవసరాలకనుగుణంగా సదుపాయాలు
కాలనీలకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి ఏర్పాట్లు
రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ప్రతి స్టేషన్‌కూ స్థానిక ప్రణాళికపై త్వరలో నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలను కల్పించేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ కసరత్తు చేపట్టింది. మెడల్ మెట్రోస్టేషన్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా అమలు చేయాల్సిన ప్రణాళికలపై త్వరలో సమగ్ర నివేదిక రూపొందించను న్నారు. మొదట ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న కొన్ని మెట్రోస్టేషన్లను ప్రయోగాత్మకంగా ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
57 స్టేషన్ల నుంచి..
ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్‌లలో 57 స్టేషన్‌ల నుంచి మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు 4.80 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. నాగోల్–రాయదుర్గం కారిడార్‌లో ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువ. మియాపూర్– ఎల్‌బీనగర్ కారిడార్‌లో మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికుల రాకపోకలతో స్టేషన్‌లు సందడిగా ఉంటాయి. ఈ రెండు కారిడార్‌లలోనే నిత్యం 4.20 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా.
జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో ప్రయాణికుల రద్దీ తక్కువ. మియాపూర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, నాగోల్, అమీర్‌పేట్, రాయదుర్గం స్టేషన్‌ల చుట్టుపక్కల కాలనీల నుంచి రాకపోకలు అత్యధికం. ఈ మేరకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయం లేదు. కొన్ని స్టేషన్లలో ప్రవేశ ద్వారాల నిర్వహణ, రద్దీ నియంత్రణ, మౌలిక సదుపాయాల సమస్యలున్నాయి. ఒక్కో స్టేషన్‌లో ప్రత్యే క సమస్యలను గుర్తించి అందుకనుగుణంగా కా ర్యాచరణ ప్రణాళికలు రూపొందించనున్నారు.
వివిధ విభాగాలతో సమన్వయం..
ఆర్టీసీ, రవాణా, రైల్వే, జీహెచ్‌ఎంసీ, పోలీస్, తదితర విభాగాల సమస్వయంతో ప్రయాణికులకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ఆయా విభాగాలతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు.
వారం రోజుల్లో నివేదిక..
ఇప్పటికే క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలపై అధ్యయనం చేసి స్థానిక ప్రణాళికలను వారం రోజుల్లో సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని స్టేషన్లను ఎంపిక చేసి ‘మెట్రో మోడల్ స్టేషన్’లుగా అభివృద్ధి చేయనున్నారు. దశలవారీగా ఈ ప్రణాళికలు విస్తరించనున్నారు.


