breaking news
Metrostesan
-
మోడల్ మెట్రో స్టేషన్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలను కల్పించేందుకు హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు చేపట్టింది. మెడల్ మెట్రోస్టేషన్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా అమలు చేయాల్సిన ప్రణాళికలపై త్వరలో సమగ్ర నివేదిక రూపొందించను న్నారు. మొదట ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న కొన్ని మెట్రోస్టేషన్లను ప్రయోగాత్మకంగా ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 57 స్టేషన్ల నుంచి..ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో 57 స్టేషన్ల నుంచి మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు 4.80 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. నాగోల్–రాయదుర్గం కారిడార్‌లో ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువ. మియాపూర్– ఎల్బీనగర్ కారిడార్‌లో మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికుల రాకపోకలతో స్టేషన్లు సందడిగా ఉంటాయి. ఈ రెండు కారిడార్లలోనే నిత్యం 4.20 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా.జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో ప్రయాణికుల రద్దీ తక్కువ. మియాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, అమీర్‌పేట్, రాయదుర్గం స్టేషన్ల చుట్టుపక్కల కాలనీల నుంచి రాకపోకలు అత్యధికం. ఈ మేరకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయం లేదు. కొన్ని స్టేషన్లలో ప్రవేశ ద్వారాల నిర్వహణ, రద్దీ నియంత్రణ, మౌలిక సదుపాయాల సమస్యలున్నాయి. ఒక్కో స్టేషన్లో ప్రత్యే క సమస్యలను గుర్తించి అందుకనుగుణంగా కా ర్యాచరణ ప్రణాళికలు రూపొందించనున్నారు.వివిధ విభాగాలతో సమన్వయం..ఆర్టీసీ, రవాణా, రైల్వే, జీహెచ్ఎంసీ, పోలీస్, తదితర విభాగాల సమస్వయంతో ప్రయాణికులకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ఆయా విభాగాలతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. వారం రోజుల్లో నివేదిక.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలపై అధ్యయనం చేసి స్థానిక ప్రణాళికలను వారం రోజుల్లో సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని స్టేషన్లను ఎంపిక చేసి ‘మెట్రో మోడల్ స్టేషన్’లుగా అభివృద్ధి చేయనున్నారు. దశలవారీగా ఈ ప్రణాళికలు విస్తరించనున్నారు. -
ఢిల్లీ రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కీర్తినగర్ మెట్రో స్టేషన్లో దారుణం జరిగింది. ఇద్దరు రైల్వే ఉద్యోగులు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు వారికి సహకరించారు. మొత్తం నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త నుంచి వేరుగా ఉంటున్న ఓ ఒంటరి మహిళను ఉద్యోగం ఇప్పిస్తానంటూ రైల్వే ఉద్యోగి ఒకరు నమ్మించాడు. తన కుమారుడి బర్త్‌డే వేడుకకు రావాలంటూ ఆహ్వానించాడు. ఈనెల 21వ తేదీన కీర్తినగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్న ఆమెను రాత్రి 10.30 గంటల సమయంలో ఆ ఆవరణలోనే ఉన్న రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది గదికి తీసుకెళ్లాడు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లి, మరో ఫ్రెండ్‌ను తీసుకొచ్చాడు. బయట మరో ఇద్దరు సహోద్యోగులు కాపలా కాస్తుండగా వీరు ఆమెపై అత్యాచారం చేశారు. శనివారం ఉదయం బాధితురాలు రైల్వే అధికారులకు తన ఆవేదనను వివరించింది. అధికారుల ఆదేశాల మేరకు, పోలీసులు బాధ్యులైన నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. -
మెట్రో స్టేషన్ పైనుంచి దూకి యువతి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అక్షర్ధామ్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ యువతి (22) ఆత్మహత్యకు పాల్పడింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఈమె గురువారం ఉదయం 7.30 సమయంలో మెట్రోస్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించింది. అది చూసి వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను వారించేందుకు ప్రయత్నించారు. ఆమె వినకపోవడంతో కాపాడేందుకు కింద భారీ దుప్పటిని అడ్డుగా పట్టుకుని నిలబడ్డారు. కిందికి దూకిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో కన్నుమూసిందని అధికారులు తెలిపారు. ఆ యువతి గత కొద్ది రోజులుగా గుర్గావ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందన్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మెట్రో భవనం పైనుంచి దూకుతున్న యువతి -
రైల్వే స్టేషన్లలో ‘వే ఫైండింగ్ మ్యాప్’
ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు సాక్షి, ముంబై : మెట్రోస్టేషన్ చుట్ట పక్కల ఉన్న ప్రాంతాలను మీరు సులువుగా తెలుసుకునేందుకు వీలుగా అంధేరి, వర్సోవ మెట్రో స్టేషన్లలో మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. ఈ మ్యాప్‌ల ద్వారా ప్రయాణికులు తాము చేరుకోవాల్సిన గమ్యస్థానాలను మరింత సులువుగా తెలుసుకునే వీలు ఉంటుంది. మ్యాప్‌లలో ముఖ్యమైన ల్యాండ్ మార్కులు, అదేవిధంగా భవనాలు, కార్యాలయాలు, ఈ మెట్రో స్టేషన్లకు ఐదు కి.మీ. వరకు ఉన్న మార్గాలను ఈ మ్యాప్ సూచిస్తుంది. ఇదిలా ఉండగా, స్టేషన్ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది ప్రయాణికులకు సరైన మార్గం తెలియక రవాణాను ఆశ్రయిస్తుంటారు. కాగా, ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉన్న ఆస్పత్రులు, కార్యాలయాలు, సందర్శన స్థలాలు తదితర వాటికోసం వేరే రవాణా మార్గాలపై ఆధారపడకుండా నడిచి వెళ్లే విధంగా ఈ మ్యాప్‌ను ఏర్పాటు చేశామని అధికారి తెలిపారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను మరింత సులువుగా తెలుసుకునేందుకు ఈ మ్యాప్ ఎంతో దోహద పడుతుందన్నారు. ద ముంబై ఎన్విరాన్మెంటల్ సోషల్ నెట్వర్క్ (ఎఈఎస్ఎన్) వర్సోవా, అంధేరి స్టేషన్లలో 13 ‘వే ఫైండింగ్ మ్యాప్’లను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను బాంబే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (బీసీసీఐ) ఆర్థిక సహాయం చేసింది. ఈ మెట్రో స్టేషన్ల ఆవరణలోని ప్రాంతాల విషయమై చాలామంది ప్రయాణికులకు అవగాహన ఉండదు. వీరు ఆటో, ట్యాక్సీలను ఆశ్రయిస్తుంటారు. దీంతో ఆటోలు, ట్యాక్సీలతో మెట్రో స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి. ప్రయాణికులు వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని మ్యాప్‌ల ద్వారా తెలియజేయడం ద్వారా దగ్గర ఉన్న ప్రాంతాలకు నడిచి వెళ్లేందుకు నిర్ణయించుకుంటారని ఎంఈఎస్ఎన్కు చెందిన తృప్తి వైట్ల అభిప్రాయపడ్డారు. ఈ మ్యాప్‌లను స్టేషన్లలో అమర్చినందుకు గాను రూ.5 లక్షల వ్యయం అయిందని ఆయన తెలిపారు. స్టేషన్లకు కొంచెం దూరంలో ఉన్న ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలు, బ్యాంక్‌లకు వెళ్లాలనుకున్న ప్రయాణికులకు ఈ మ్యాప్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనీ, ప్రయాణికులకు మార్గదర్శకాలుగా ఉపయోగపడుతాయని ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి మ్యాప్‌లనే ఘాట్కోపర్, సాకినాకా స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయడానికి ఎమ్మెమ్మార్డీఏ యోచిస్తోంది. అయితే ఈ మ్యాప్‌ల పట్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చిన తర్వాతనే మిగతా స్టేషన్లలో కూడా అమర్చనున్నట్లు అధికారి వెల్లడించారు. అంతేకాకుండా ముఖ్య రైల్వే స్టేషన్లలో, బెస్ట్ బస్టాపుల్లో కూడా ఈ మ్యాప్‌లను ఏర్పాటు చేయడానికి అధికారులు యోచిస్తున్నారు.


