కోమటిరెడ్డి బ్రదర్స్‌తో అదే చెప్పా: ఎమ్మెల్యే సామెల్‌ | Tungaturthi Tensions Escalate: MLA Samuel Targets Komatireddy Brothers | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి బ్రదర్స్‌తో అదే చెప్పా: ఎమ్మెల్యే సామెల్‌

Jul 25 2026 1:42 PM | Updated on Jul 25 2026 1:54 PM

Tungaturthi Tensions Escalate: MLA Samuel Targets Komatireddy Brothers

సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్‌లో తుంగతుర్తి పంచాయితీ మరోసారి తీవ్ర విభేదాలను బయటపెట్టింది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ తీరుపై తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా పర్యటనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. తనకు టికెట్‌ ఇచ్చింది రాజగోపాల్‌రెడ్డి కాదని, ఏఐసీసీ అని స్పష్టం చేశారు.

తనకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వడంలో రాజగోపాల్‌రెడ్డి పాత్ర లేదని ఎమ్మెల్యే సామెల్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టికెట్‌ నా చేతిలో లేదు.. రాజగోపాల్‌రెడ్డి చేతిలో అంతకన్నా లేదు. ఏఐసీసీ నాకు టికెట్‌ ఇచ్చింది. నన్ను గెలిపించింది రాజగోపాల్‌రెడ్డి కాదు.. పార్టీ’’ అని పేర్కొన్నారు.

‘నాకు తెలియకుండా ఎలా?’
తన నియోజకవర్గంలోకి రావాలంటే కనీస సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని సామెల్‌ అన్నారు. ‘‘నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గౌరవం ఉండాలని పేర్కొన్నారు. 

‘పార్టీలో నేనే ముందున్నా’
కాంగ్రెస్‌లో తానే ముందునుంచి ఉన్నానని ఎమ్మెల్యే సామెల్‌ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు తన కేడర్‌ ఎంతో కష్టపడిందని, అయితే ఇప్పుడు అదే కేడర్‌ బాధపడుతోందని అన్నారు. ‘‘మునుగోడులో ఆయన్ను గెలిపించినందుకు నా కార్యకర్తలు బాధపడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి గతంలో తన గెలుపుపై వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ‘‘నేను గెలుస్తా అని గతంలో రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చారు’’ అని విమర్శించారు.

కులాల ఓట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై కూడా సామెల్‌ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజగోపాల్‌రెడ్డికి మాదిగలు ఓటు వేశారు.. నాకు రెడ్లు ఓటేశారు’’ అని అన్నారు.

‘ఎన్నిసార్లు కలిసినా రోడ్లు ఇవ్వలేదు’
గతంలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ‘‘నేను ఎన్నోసార్లు కలిశాను. రోడ్లు కావాలని అడిగాను. చివరకు అటెండర్‌తో ఫోన్‌ చేయించినా వెళ్లి కలిసేవాడిని’’ అని పేర్కొన్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యాఖ్యలు
కోమటిరెడ్డి సోదరులు నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తాను చెప్పినట్లు సామెల్‌ వెల్లడించారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఇన్‌వాల్వ్‌ కానివ్వొద్దని చెప్పా. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఇకనైనా అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు. మొత్తంగా మునుగోడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సామెల్‌, కోమటిరెడ్డి బ్రదర్స్‌ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి తెరపైకి రావడంతో రాజకీయాలను మరింత వేడెక్కించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement