వృథా చేస్తే కనెక్షన్ కట్ చేస్తాం
నల్లగొండ టూటౌన్ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. దీంతో తాగునీటి ప్రాజెక్టులపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా నల్లగొండ నగరానికి తాగునీరందించే ఉదయం సముద్రం నీటిని పొదుపు చేయకుండా ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి నీటి వృథాను ఎవరు కూడా పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదు. కానీ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తాగునీటిని పొదుపుగా వాడుకోవాల్సిన జనం అవగాహన లేకుండా ఇంట్లో వాడకంతో పాటు ఆరుబయట కడగడం, ర్యాంపులను, వాహనాలను సైతం కృష్ణాజాలాలతోనే శుభ్రపరుస్తూ తాగునీటిని వృథా చేస్తున్నారు. జూలై చివరి వారానికి వచ్చినా కనీసం ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురవలేదు. దీంతో రానున్న రోజుల్లో కరువు ఎంతటి తీవ్రంగా ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది.
పొదుపు మంత్రం పాటించని కార్పొరేషన్
తాగునీటిని పొదుపుగా వాడుకోవాలనే దానిపై నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కాలనీల్లో ప్రజలకు తాగునీటి పొదుపు గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నా యంత్రాంగం దానిపై దృష్టి పెట్టలేదు. నగరంలోని మర్రిగూడ, చర్లపల్లి, శాంతినగర్, ఆర్టీసీ కాలనీ, పాత బస్తీలో కొన్ని కాలనీలు, శ్రీనగర్ కాలనీ, రవీంద్రనగర్, శివరాంగనర్, సావర్కర్‌నగర్, పద్మావతీ కాలనీ, డీవీకే రోడ్డు ప్రాంతంలో కొన్ని కాలనీలు, గొల్లగూడ, బీటీఎస్ తదితర ప్రాంతాల్లో తాగునీటిని ఎక్కువగా దుబారా చేస్తున్నట్లు తెలిసింది. కొందరు సంపులకు మోటార్లు వేసి ట్యాంక్‌లోకి ఎక్కించి అన్నింటికి కృష్ణాజలాలు వాడుతూ తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నారు. మరికొందరు సంప్ నిండిన తరువాత కూడా నల్లా బంద్ చేయకపోవడంతో డ్రెయినేజీలోకి వృథాగా పోతున్నాయి. ఇలాంటి వాటిపై ముందుగానే మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టి తాగునీటి వృథాను అరికట్టాల్సిన అవసరం ఉంది. నీటి వృథాను అరికట్టకపోతే రానున్న రోజుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొవాల్సి ఉంటుంది.
2.45 లక్షల జనాభాకు 37 ఎంఎల్‌డీ నీరు
నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2.45 లక్షల జనాభా ఉంది. ఈ జనాభా కోసం ప్రతిరోజూ పానగల్ ఉదయ సముద్రం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ప్లాంట్ నుంచి 37 మిలియన్ లీటర్స్ ఫర్‌డే (ఎంఎల్‌డీ) తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో దాదాపు 20నుంచి 30 శాతం వరకు నీరు వృథా చేస్తున్నారని అంచనా. తాగునీటిని ప్రతిరోజూ గంట పాటు సరఫరా చేస్తున్నారు. ఇకనుంచి నీటి పొదుపు కోసం సమయం కూడా తగ్గించాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
తాగునీటిని వృథా చేయవద్దని తమ సిబ్బంది ద్వారా ప్రచారం చేయిస్తున్నాం. నీటిని వృథా చేస్తే కనెక్షన్ కట్ చేస్తాం. తాగునీటిని దుబారా చేయకుండా అవసరం మేరకే వాడుకోవాలి.
– దిలీప్ భార్గవ్, ఏఈ,
నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్
నగరంలో తాగునీటి వృథా నిత్యకృత్యం
ఫ ర్యాంపుల నుంచి వాహనాలు కడిగేదాకా కృష్ణానీరే వాడకం
ఫ నీటి పొదుపు చర్యలపై అవగాహన కల్పించని కార్పొరేషన్ యంత్రాంగం
ఫ తేరుకోకపోతే మున్ముందు తాగునీటికి కటకటే..
డివిజన్‌లు 48
జనాభా 2.45లక్షలు
రోజు నీటి సరఫరా 37ఎంఎల్‌డీ


