నల్లగొండ : బీఎల్‌ఓలపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని.. అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు నామిరెడ్డి వెంకటరమణ అన్నారు. ఇటీవల ఒక సమావేశంలో బీఎల్‌ఓలను అవమానపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం నల్లగొండలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం అనుచితంగా మాట్లాడడంపై అంగన్‌వాడీ కార్యకర్తలు, బీఎల్‌ఓలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, బీఎల్‌ఓలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం లేదని, కేవలం జీతాలు, సంక్షేమ పథకాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మాట్లాడడం సరికాదన్నారు. కార్యక్రమంలో బుర్రి సునీత, శశికళ, పుష్పకళ, సరోజ, కవిత, మౌనిక, రాములమ్మ, రాజ్యం, అరుణ, ఉష శ్రీ, గౌతమి తదితరులు పాల్గొన్నారు.


