నకిలీ నివాస ద్రువీకరణపత్రాలతో దరఖాస్తులు
దరఖాస్తుకు నిబంధనలు ఇవే..
అంగన్‌వాడీ పోస్టుల్లో..
మిర్యాలగూడ : అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుతున్నాయి. పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా ర్యాండమ్‌గా రిజర్వేషన్లు కేటాయించగా.. నిబంధనల ప్రకారం ఆయా ప్రాజెక్ట్ అంగన్‌వాడీ సెంటర్ సర్వే పరిధిలో ఉన్న అభ్యర్థి నుంచి దరఖాస్తులను స్వీకరించాలి. కానీ, ఆ ప్రాంత పరిధి కాకుండా పట్టణం, మండల వ్యాప్తంగా వేరే ప్రాంతాల్లో నివసించేవారు పోస్టు ఖాళీగా ఉన్న ప్రాంతానికి సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రాలను సృష్టించి దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఏమీ పరిశీలించకుండానే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ఐసీడీఎస్ అధికారులు కూడా అక్కడి ఓటరు, స్థానిక నివాసి కాకపోయినప్పటికీ కేవలం నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారి దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. దీంతో స్థానిక ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది.
9 ఐసీడీఎస్ ప్రాజెక్టులు
నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, అనుముల, దామరచర్ల, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో 2,093 కేంద్రాలు ఉన్నాయి. 1923 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 170 టీచర్ పోస్టులు, 756 ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా.. మొదటి విడతలో 140 టీచర్లు, 197 ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 10తో దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగా ఇటీవల దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు.
ఎస్సీ కేటగిరీలో అందరూ దరఖాస్తు
ప్రధానంగా రిజర్వేషన్ విషయంలో అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక ఓటరు, స్థానిక నివాసి కాకపోయినప్పటికీ కేవలం నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారి దరఖాస్తులకు ఐసీడీఎస్ అధికారులు ఆమోదం తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ అయిన పోస్టులకు ఎస్టీలు దరఖాస్తు చేసుకోగా, ఎస్సీ గ్రూప్–1, 3 రిజర్వ్ అయిన పోస్టులకు మాత్రం ఎస్సీలోని అన్ని కేటగిరివారు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అంగన్‌వాడీలో టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేస్తాం. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశాం. త్వరలో ఫిజికల్ వెరిఫికేషన్ చేసి సెంటర్ పరిధిలో స్థానికంగా ఉన్న దరఖాస్తుదారులను పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తాం.
– వేణుగోపాల్‌రావు, సీడీపీఓ, మిర్యాలగూడ
ఫ రిజర్వేషన్లకు తిలోదకాలు
ఫ సరిఫికెట్ల పరిశీలనలో ఆ దరఖాస్తులను ఆమోదించిన అధికారులు
ఫ స్థానికులకు తీరని అన్యాయం
సెంటర్ సర్వే పరిధిలోని
మహిళ అయి ఉండాలి.
ఆ మహిళ ఆ ప్రాంత కోడలు అయి ఉండాలి
ఆ ప్రాంతంలో అత్యాచారానికి, నిర్బంధానికి గురైన, వితంతువు ఉంటే వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఆ ప్రాంతంలో ఓటు హక్కుతోపాటు ఆధార్‌కార్డులో అడ్రస్ ఖచ్చితం అయి ఉండాలి
కనీసం ఆ ప్రాంతంలో ఆరు నెలల పాటు నివాసం ఉండి ఆ ప్రాంత ప్రజలకు తెలిసినవారై ఉండాలి
కేటాయించిన రిజర్వేషన్‌కు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతతోపాటు సామాజిక, ప్రభుత్వం అమలు చేస్తున్న పల్స్‌పోలియో, ఇతర కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.


