ఎన్డీయే మంత్రి కూతురు.. కేంద్రంపై నిరసన స్వరం | NEET Protest Gets Political Heat as Minister Daughter Joins Student Stir | Sakshi
Sakshi News home page

ఎన్డీయే మంత్రి కూతురు.. కేంద్రంపై నిరసన స్వరం

Jul 25 2026 11:46 AM | Updated on Jul 25 2026 11:58 AM

NEET Protest Gets Political Heat as Minister Daughter Joins Student Stir

నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీక్‌ ఆరోపణలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతుండగా.. తాజాగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.

అస్సాం రెవెన్యూ మంత్రి కేశబ్‌ మహంతా కుమార్తె దిబిసా మహంతా గువాహటిలో జరిగిన విద్యార్థుల నిరసనలో పాల్గొందంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాచల్‌ ప్రాంతంలో గురువారం నిర్వహించిన ఈ ఆందోళనలో ఆమె విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. నీట్‌ పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్‌ లీక్‌ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

దిబిసా మహంతా నిరసనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అసోం గణ పరిషత్‌ (ఏజీపీ)కు చెందిన కేశబ్‌ మహంతా.. బీజేపీ నేతృత్వంలోని అసోం ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. మిత్రపక్ష ప్రభుత్వంలో భాగమైన సీనియర్‌ నేత కుమార్తె.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై డిమాండ్లతో జరుగుతున్న నిరసనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కూతురి నిరసనపై తండ్రి స్పందించాల్సి ఉంది. 

అయితే ఢిల్లీలో కొనసాగుతున్న నీట్‌ నిరసనలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం తాజాగా స్పందించారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, వారి డిమాండ్లు, వాదనలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం అసోం వరదలతో తీవ్రంగా ప్రభావితమైందని, ప్రకృతి విపత్తుపై కూడా అందరూ దృష్టి పెట్టాలని కోరారు.

ఇదిలా ఉండగా, నీట్‌ నిరసనలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు.. ఆందోళనలకు మద్దతుగా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నారు. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. 

మరోవైపు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ సహా పలు ప్రాంతాల్లో నీట్‌ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో నిరసనకారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement