సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత సాధించిన విజయాన్ని మా ఖాతాలో వేసుకోవడం లేదని.. ఇది యువత సాధించిన విజయంగా పేర్కొన్నారు.
’’రాజకీయ పార్టీలు కేవలం మద్దతు మాత్రమే ఇచ్చాయి. ఓటు హక్కు ను 18 ఏళ్లకే కల్పించి యువతను రాజకీయాల్లో రాజీవ్ గాంధీ ప్రోత్సహించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో 18 ఏళ్ల యువతకు చట్టసభల్లో అవకాశం ఇచ్చారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. 21 ఏళ్లకే చట్టసభల్లోకి వచ్చేలా యువతకు అవకాశం ఇవ్వాలని సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం’’ అని రేవంత్ చెప్పారు.
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ర్యాలీ నిర్వహించామని.. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఏకచ్ఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా యావత్ విద్యార్థి లోకం ఏకమైంది. నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించలేని దుస్థితి. చైనా చొచ్చుకొస్తుంటే అడ్డుకోలేని దుస్థితి. విద్యార్థి లోకానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు.


