ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు! | CM Revanth Comments at student solidarity rally | Sakshi
Sakshi News home page

ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు!

Jul 26 2026 4:50 AM | Updated on Jul 26 2026 4:50 AM

CM Revanth Comments at student solidarity rally

నెక్లెస్‌రోడ్డులో జరిగిన క్యాండిల్‌ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీ, భట్టి విక్రమార్క, అరెకపూడి గాంధీ, బీర్ల ఐలయ్య, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అజహరుద్దీన్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, విద్యార్థులు

యువత గళం జంతర్‌మంతర్‌ నుంచి లోక్‌సభలో వినిపించాలి.. ఇందుకోసం 25 ఏళ్ల వరకు ఆగాల్సిన అవసరం లేదు 

21 ఏళ్లకే లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశం కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం 

మీ పోరాటంతోనే మోదీ తలవంచారు... 

విద్యార్థి సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు 

పీసీసీ అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు 21 ఏళ్లకే చట్టసభల తీర్మానంపై సీఎం ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: ‘రోడ్లపై జరిగిన మీ పోరాటం మళ్లీ ఇంటికి వెళ్లొద్దు. జంతర్‌మంతర్‌ నుంచి నేరుగా లోక్‌సభ, రాజ్యసభకు వెళ్లాలి. ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు. ఇక్కడ వినిపించిన గళం చట్టసభల్లో ప్రవేశించాలి. మీ ఆలోచన ప్రపంచానికి చాటిచెప్పాలి. నాడు రాజీవ్‌గాంధీ హయాంలో రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే దేశ యువతకు ఓటు హక్కు కల్పించారు. 21 ఏళ్లకే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవుతున్నారు. కానీ, ఈ దేశ యువత లోక్‌సభకు, అసెంబ్లీకి వెళ్లాలంటే 25 ఏళ్ల వరకు, రాజ్యసభకు, శాసనమండలికి వెళ్లాలంటే 30 ఏళ్ల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. అందుకే దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలి. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనసభ, మండలిని ప్రత్యేకంగా సమావేశపరుస్తా. 21 ఏళ్లకే చట్టసభల్లోకి ప్రవేశం కల్పించేలా అన్ని పక్షాలతో చర్చించి రాష్ట్రం తరఫున తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. రాహుల్, ఖర్గే సహకారంతో పార్లమెంటులో ఆమోదానికి ప్రయత్నిస్తాం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

ఈసారి రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే జెన్‌జీ నాయకుడికి కేంద్ర విద్యా శాఖ మంత్రిగా అవకాశం వస్తుందని, అలా ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని, ఇండియా కూటమి పక్షాలతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు నిరసనగా, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ, విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా టీపీసీసీ ఆధ్వర్యలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో రేవంత్‌రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొంగులేటి, అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్‌ యాదవ్‌తో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

మోదీ మెడలు వంచారు... 
ఇందిరాగాంధీ విగ్రహం వద్ద యువతనుద్దేశించి సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. లాఠీలు, తూటాలు విద్యార్థి ఉద్యమ స్ఫూర్తిని నిలువరించలేకపోయాయని, ప్రధాని మోదీని ఓడించి ధర్మేంద్ర ప్రదాన్‌ చేత రాజీనామా చేయించిన విద్యార్థుల పోరాట స్ఫూర్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. 56 అడుగుల చాతీ సాగిలపడిందని ఎద్దేవా చేశారు. సోమవారంలోపు విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడకు వచ్చిన యువకులెవరూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కాదని రేవంత్‌ అన్నారు. పోరాడి దేశ యువత సాధించిన విజయాన్ని కాంగ్రెస్‌ ఖాతాలో రాసుకోదల్చుకోలేదన్నారు. ఈ పోరాటం, విజయం యువతదే అని చెప్పారు. 

21 ఏళ్లకే ప్రధాని కావచ్చు 
‘శాసనసభతోపాటు లోక్‌సభ, స్థానిక సంస్థలు చట్టసభల్లో ప్రధానమైనవి. ఈ స్థానిక సంస్థల్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతకు జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మేయర్లుగా అవకాశం వస్తోంది. తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి నాడు 21 సంవత్సరాలకే ఐఏఎస్‌ సాధించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన డి. అనన్య అనే అమ్మాయి 21 ఏళ్లకే ఐఏఎస్‌ అయింది. 32 ఏళ్ల క్రితం తన 22 సంవత్సరాల వయసులోనే డీజీపీ సీవీ ఆనంద్‌ ఐపీఎస్‌ అయ్యారు. కానీ, అసెంబ్లీ, లోక్‌సభకు వెళ్లాలంటే 25 ఏళ్ల వరకు, రాజ్యసభ, శాసనమండలికి వెళ్లాలంటే 30 ఏళ్ల వరకు ఆగాల్సి వస్తోంది. జర్మనీ, గ్రేట్‌ బ్రిటన్‌ లాంటి దేశాల్లో 18 ఏళ్లు పూర్తయితే చట్టసభలకు వెళ్లడమే కాకుండా దేశ ప్రధానులుగా, అధ్యక్షులుగా కూడా కావచ్చు. సింగపూర్‌లో 21 ఏళ్లకే ప్రధాని కావచ్చు. కానీ, మనదేశంలో ఆ పరిస్థితి లేదు. అందుకే 25 ఏళ్ల వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో విద్యా, ఐటీ శాఖలు 60, 70 ఏళ్లున్న వారు కాదు.. 21 ఏళ్ల వయసున్న యువకులు మంత్రులుగా నిర్వహించాలి. జెన్‌జీ యువ కెరటాలకు చట్టసభల్లో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి’అని సీఎం రేవంత్‌ అన్నారు.  

తెలంగాణ నుంచే ప్రారంభం: మహేశ్‌ గౌడ్‌ 
టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ ‘దేశ వ్యాప్తంగా విద్యార్థి లోకం ఒక్కటైంది. 56 ఇంచుల చాతీ అని చెప్పుకునే ప్రధాని మోదీ నీట్‌ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి దేశంలో ఏర్పడింది. యువతకు చట్టసభల్లో మాట్లాడే అవకాశం వచ్చేంతవరకు ఇలాంటి లీకేజీలు జరుగుతుంటాయి. రాహుల్‌ ప్రధాని అయితే జెన్‌జీ నుంచి ఒకరు విద్యా మంత్రి అవుతారు. ఉభయసభలను సమావేశపరిచి 21 ఏళ్లకే చట్టసభల్లోకి ప్రవేశించే విధంగా తీర్మానం చేయాలని సీఎం రేవంత్‌ను కోరుతున్నా. దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసే ఆలోచన తెలంగాణ నుంచే ప్రారంభం కావాలి’అని వ్యాఖ్యానించారు. ర్యాలీలో పాల్గొన్న ఒక విద్యార్థిని మాట్లాడుతూ తాను కూడా నీట్‌పరీక్ష రాశానని, అయితే నీట్‌ గత రెండేళ్లుగా లీక్‌ అవుతోందని, కానీ ఈ సంవత్సరమే వెలుగులోకి వచ్చిందని చెప్పారు. సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ప్రజాస్వామిక విజయమని అన్నారు. కాగా, కార్యక్రమం ముగిసిన తర్వాత యువతతో రేవంత్‌ సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోలు దిగారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement