ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్ ‘చలో సంసద్ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జంతర్ మంతర్ దగ్గర గత వారం జరిగిన ఉద్రిక్త ఆందోళనలకు సంబంధించిన వందలాది గిగాబైట్ల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ.. సీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులకు, సీజేపీ మద్దతుదారులకు మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే.
సుమారుగా 100 సీసీటీవీ వీడియో క్లిప్‌లలో నిరసనకారులు.. భద్రతా వలయాలను ఛేదించడం, పోలీసు సిబ్బందిపై దాడి, రాళ్లు రువ్వి ఆస్తులను ధ్వంసం చేయడం రికార్డయింది. ఇప్పటివరకు ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్) ద్వారా 2,873 మంది నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించారు. వీరిలో 989 మందిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ, పోక్సో చట్టం కింద నమోదైన కేసులతో సహా పలు తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇందులో 101 మంది హత్య కేసుల్లో, 284 మంది దొంగతనం కేసుల్లో.. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న 92 మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులు చేయడం, బారికేడ్లను బద్దలు కొట్టడం, రాళ్లు రువ్వడం, పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, వాహనాలను ధ్వంసం చేయడం, వాహనాల లోపల ఉన్న పోలీసులపై దాడి చేయడం, నిరసన మార్గంలో ఉన్న ప్రజా ఆస్తులను, దుకాణాలను ధ్వంస చేయడం వంటి ఘటనలు పలు ప్రదేశాల్లో సీసీటీవీలలో రికార్డయ్యాయి. కొన్ని ఫుటేజీలలో గుంపుగా బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగడం, జూలై 20న సంసద్ మార్గ్ వద్ద పలు చోట్ల రాళ్లు రువ్విన దృశ్యాలు ఉన్నాయి.
అదే రోజు.. జంతర్ మంతర్ సమీపంలో పోలీసులు లోపల కూర్చున్నప్పటికీ, గుంపు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేసి, ఒక పోలీసు వాహనాన్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నించింది. టాల్‌స్టాయ్ మార్గ్ వద్ద ఒక వాహనానికి నిప్పు పెట్టడం, బస్సు టైర్లను పంక్చర్ చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. పోలీసు సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు జరిగినట్లు పలు వీడియోలు స్పష్టంగా చూపుతున్నాయని వర్గాలు తెలిపాయి. గాయపడిన ఒక మహిళా పోలీసు అధికారిని ఆమె సహచరులు సురక్షిత ప్రాంతానికి తరలించడం కనిపించింది.
సంసద్ మార్గ్ వద్ద గుంపు ఒక పోలీసును చుట్టుముట్టి దాడి చేసింది. గాయపడిన పోలీసు సిబ్బంది యూనిఫామ్‌లపై రక్తం కారుతున్న అనేక క్లిప్‌లు ఉన్నాయి. ఢిల్లీ పోలీసుల ప్రకారం సుమారు 200 మంది పోలీసులు గాయపడ్డారు. జూలై 22న రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసు అధికారులు నంద్‌కిషోర్, వివేక్ భగత్‌లపై జరిగిన దాడులు నమోదయ్యాయి. కొంతమంది నిరసనకారులు కెమెరా ముందు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను సేకరించి తదుపరి చర్యల నిమిత్తం విశ్లేషిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. వీటిలో కన్నాట్ ప్లేస్‌లో ఓ మహిళ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, సంసద్ మార్గ్ వద్ద ఓ వ్యక్తి పార్లమెంటు గురించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోలీసులపై ఒక మహిళ బూతులు తిట్టిన దృశ్యాలు ఉన్నాయి.


