కేసుల రద్దుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి  | CJP seeks written assurance on withdrawal of FIRs | Sakshi
Sakshi News home page

కేసుల రద్దుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి 

Jul 28 2026 6:29 AM | Updated on Jul 28 2026 6:29 AM

CJP seeks written assurance on withdrawal of FIRs

లేకుంటే మళ్లీ ఆందోళనలకు దిగుతాం 

కేంద్రానికి సీజేపీ హెచ్చరిక

సాక్షి, న్యూఢిల్లీ: పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ)సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మంగళవారంలోగా ఆమేరకు హామీ లభించకుంటే మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. సీజేపీ జాతీయ ప్రతినిధులు అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌తో కలిసి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులు, నిర్వాహకులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉప సంహరించుకుంటామని, కొత్తగా ఎవ్వరిపైనా కేసులు పెట్టబోమని మూడో విడత చర్చల సమయంలో కేంద్రం మాకు హామీ ఇచ్చింది. 

ఆ తర్వాతే 36 రోజులపాటు జంతర్‌మంతర్‌లో కొనసాగించిన నిరసనలను ఉపసంహరించుకున్నాం’అని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ‘ముసాయిదా ఒప్పందాన్ని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు అందజేయగా వారు ఆమోదం తెలిపారు. న్యాయనిపుణులతో చర్చలు జరిపాక మంగళవారం కల్లా ప్రభుత్వం లిఖిత పూర్వక ఒప్పందాన్ని అందజేస్తుందని మాకు హామీ ఇచ్చారు’అని వివరించారు. ‘ప్రభుత్వం నుంచి అందాల్సిన లిఖిత పూర్వక ఒప్పందం కోసం మేం ఎదురు చూస్తున్నాం. కేబినెట్‌ సీనియర్‌ మంత్రులు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాం. నిరసనకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించరాదు. భవిష్యత్తులో వారిపై ఎటువంటి కేసులు పెట్టరాదు’అని రాంకా, దాస్‌ స్పష్టం చేశారు. లేనిపక్షంలో తాము మరోసారి నిరసనలకు దిగక తప్పదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement