ఏపీ డీఎస్సీపై కేంద్రం స్పందన | Centre response regarding AP DSC | Sakshi
Sakshi News home page

ఏపీ డీఎస్సీపై కేంద్రం స్పందన

Jul 28 2026 5:14 AM | Updated on Jul 28 2026 5:14 AM

Centre response regarding AP DSC

పారదర్శకంగా, ఆన్‌లైన్‌ విధానంలో నియామకాలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచన 

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, తనూజారాణి ప్రశ్నలకు కేంద్రం జవాబు  

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన  డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ప్రశ్నాపత్ర భద్రత, నియామక విధానం, క్రీడాకోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉపాధ్యాయుల నియామకాలు, వారి సేవా నిబంధనలు, నియామక ప్రక్రియ పూర్తిగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన పరిధిలోనే ఉంటాయని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్‌ చౌదరి తెలిపారు. లోక్‌సభలో సోమవారం వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజారాణి ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ.. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ దేశంలోని ఎక్కువ పాఠశాలలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన నియంత్రణలో ఉంటాయని తెలిపారు. 

అందువల్ల ఉపాధ్యాయుల నియామకాలు, సేవా నిబంధనలు, పోస్టింగ్‌లకు సంబంధించిన అంశాలు వాటి పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలను పారదర్శకంగా, పటిష్టంగా, సాధ్యమైనంతవరకు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీచేసినట్లు చెప్పారు. 

ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు పార్లమెంట్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టం–2024ను తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా అనుసరించేందుకు ఇది ఒక నమూనా చట్టంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. మెగా డీఎస్సీకి సంబంధించి రాష్ట్రంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై ఎంపీలు అడిగిన ప్రశ్నకు మాత్రం కేంద్రమంత్రి జవాబివ్వలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement