చిత్రహింసలు, అవమానభారం తాళలేక ఆత్మహత్య
జనసేన పార్టీ కార్యకర్త ఫిర్యాదుతో పోలీసుల దాష్టీకం
ఇంటి నుంచే బూటుకాళ్లతో తన్నుతూ స్టేషన్‌కు తరలింపు
స్టేషన్‌లోనూ నరకం చూపిన రక్షకభటులు
మరుసటి రోజూ స్టేషన్‌కు రావాలని హుకుం
పరువుపోయిందని భావించి బలవన్మరణం
రామచంద్రాపురం: చంద్రబాబు పాలనలో పోలీసులు పేట్రేగిపోతున్నారు. విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ, దళిత యువకుడు క్రాంతికుమార్, నెల్లూరు జిల్లాలో దళిత యువకుడు ఏడుకొండలు, పిడుగురాళ్లలో మైనార్టీ ఉద్యోగి హుస్సేన్ మరణాలను మరిచిపోకముందే తాజాగా ఖాకీల రాక్షసత్వానికి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువులో బీసీ వర్గానికి చెందిన మరొకరు బలికావడం రెడ్‌బుక్ నరమేధానికి పరాకాష్టగా మారింది.
చిన్నపాటి తగాదా నేపథ్యంలో జనసేన కార్యకర్త చేసిన ఫిర్యాదుతో రెచ్చిపోయిన పోలీసుల దాష్టీకానికి నిండుప్రాణం బలైంది. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు గ్రామంలో పోలీసుల చిత్రహింసలకు తాళలేక, పరువు పోయిందనే అవమానభారంతో బీసీ(బలిజ) వర్గానికి చెందిన సుబ్రమణ్యం (52) సోమవారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త హరి అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మద్యం మత్తులో తరచూ చుట్టుపక్కల వారిని దుర్భాషలాడుతున్నాడని, శనివారం తనతో ఘర్షణ పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శనివారం సాయంత్రం సుబ్రమణ్యంను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టారు.
మరుసటి రోజు ఆదివారం ఉదయాన్నే మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశారు. అయితే మరోసారి హరి తనను సుబ్రమణ్యం మళ్లీ తిడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుబ్రమణ్యంను, అతనికి మద్దతుగా వెళ్లిన అతని కుమారుడు 18 ఏళ్ల ప్రశాంత్‌ను ఇద్దరినీ ఇంటి నుంచే కాళ్లతో తన్నుకుంటూ, కొట్టుకుంటూ పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లోనూ థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారు.
జనసేన కార్యకర్త ఫిర్యాదు, ఒత్తిళ్లకు తలొగ్గి, తనను, తన కొడుకును అందరిముందు కొట్టుకుంటూ తీసుకెళ్లి స్టేషన్‌లో చిత్రవధ చేశారని తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్రమణ్యం సోమవారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తన తండ్రిని బూటు కాళ్లతో తన్నుకుంటూ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని, అందుకే మనోవ్యథతో ఆత్మహత్య చేసుకున్నాడని సుబ్రమణ్యం కుమారుడు ప్రశాంత్, కుమార్తె జయమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.


