కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యాలయానికి అర ఎకరం భూమి ఏడాదికి కేవలం రూ.వెయ్యి లీజుకు 66 ఏళ్లపాటు కేటాయించడంతోపాటు లీజు కాలాన్ని 99 ఏళ్లకు పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ
తాజాగా కళ్యాణదుర్గంలో అర ఎకరం ఇచ్చేశారు
66 ఏళ్ల లీజు.. 99 ఏళ్ల వరకు పొడిగించే వెసులుబాటు
ఈ నెలలో ఇది 4వ కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలకు భూములు కేటాయింపు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. రెండేళ్లలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు సర్కారు టీడీపీ కార్యాలయాలకు మాత్రం యథేచ్చగా భూములను పందేరం చేస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం అర ఎకరం భూమిని కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్కడ ప్రభుత్వ భూమిని ఏడాదికి కేవలం రూ.1,000 లీజుతో 66 సంవత్సరాల పాటు కేటాయించారు.
పార్టీ కొనసాగిన పక్షంలో లీజును 99 సంవత్సరాల వరకు పొడిగించే వెసులుబాటు కల్పించారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి ఎన్‌ఓసీ వచ్చిన తర్వాత భూమిని అప్పగించనున్నారు. మూడు రోజుల క్రితమే ప్రకాశం జిల్లా కొండపిలో అర ఎకరం భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ నెలలోనే రాజధాని పరిధిలోని మంగళగిరి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో అర ఎకరం చొప్పున టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను కేటాయించారు.
ఏఐజీ, గ్రీన్‌కోకి భూములు..
విశాఖ జిల్లా ఎండాడలో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)కి అదనంగా 2.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ మరో జీవో విడుదలైంది. నర్సింగ్ కళాశాల, అలైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాల, విద్యార్థులు, నర్సులు, సిబ్బందికి హాస్టళ్లు, తక్కువ ఖర్చుతో రోగుల వసతి కేంద్రాల ఏర్పాటుకు ఈ భూమిని ఎకరా రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.10.80 కోట్లతో కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ కేటాయింపునకు ఏపీ హౌసింగ్ బోర్డు సమ్మతి, మున్సిపల్ తీర్మానం, డీపీఆర్ తదితర అనుమతులు రావాల్సి ఉందని పేర్కొంది. మరో జీవో ద్వారా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొడ్డిపల్లి గ్రామంలో అటవీ శాఖకు చెందిన 66.74 ఎకరాల భూమిని గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఎకరాకు రూ.6.25 లక్షల చొప్పున మార్కెట్ విలువగా నిర్ణయించారు.


