నష్టాల ఊబిలో పొగాకు రైతులు
గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం
వారికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ పోరు
ఇందులో భాగంగా వైఎస్ జగన్ దేవరపల్లి వస్తున్నారు
పార్టీ సీనియర్ నాయకుల వెల్లడి
దేవరపల్లి: గిట్టుబాటు ధరలు లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్న పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు సోమవారం స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 5న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారని తెలిపారు. ఈ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన న్యాయం చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. జగన్ ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా రైతులకు భరోసా కల్పించి పండిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్థానిక ఎంపీపీ కేవీకే దుర్గారావు నివాసం వద్ద పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ హోం మంత్రి తానేటి వనిత, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడారు.
కర్ణాటకలో కొనుగోళ్లు ప్రారంభమైతే.. మన రైతుకు మరింత కష్టం
‘ప్రభుత్వం మెడలు వంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా జగన్ పర్యటన ఉంటుంది. రాష్ట్రంలో 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, వంద రోజుల్లో కేవలం 38 మిలియన్ కిలోల కొనుగోలు జరిగింది. మరో 20 రోజుల్లో పొగాకు కొనుగోళ్లు జరగకపోతే ఆగస్టు 15 నుంచి కర్ణాటకలో కొనుగోలు ప్రారంభమవుతాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు మరింత నష్టపోతారు. రాష్ట్రంలో లక్ష మంది రైతులు 2.05 లక్షల ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. వీరి గురించి చంద్రబాబు అసలు పట్టించుకోవడం లేదు. పైగా కొనుగోలు సంస్థలకు ప్రభుత్వం అండగా ఉండి రైతులను మోసం చేస్తోంది.
గత ఏడాది కిలో రూ.453 ధర పలకగా, ఈ ఏడాది దారుణంగా రూ.160 నుంచి రూ.265కు పడిపోయింది. మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభంపాటి జయరాజు, అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త సత్తి సూర్యనారాయణరెడ్డి, విశాఖ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు తదితర నేతలు పాల్గొన్నారు.


