గోదావరి ట్రిబ్యునల్‌ అక్కర్లేదు | Union Jal Shakti Minister CR Patil letter to CM Chandrababu on 7th of this month | Sakshi
Sakshi News home page

గోదావరి ట్రిబ్యునల్‌ అక్కర్లేదు

Jul 28 2026 4:23 AM | Updated on Jul 28 2026 4:23 AM

Union Jal Shakti Minister CR Patil letter to CM Chandrababu on 7th of this month

సెక్షన్‌–3 కింద ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం తిరస్కరణ 

ఇప్పటికే కృష్ణా, గోదావరి జలాల సమస్యలపై సంప్రదింపులు ప్రారంభించామని వెల్లడి 

ఈ మేరకు ఈనెల 7న సీఎం చంద్రబాబుకు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ లేఖ 

2014–19 మధ్య గోదావరిపై భారీగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టిన తెలంగాణ సర్కార్‌ 

నాడు ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా పట్టించుకోని చంద్రబాబు 

రెండో అపెక్స్‌ కౌన్సిల్‌లో గోదావరిపై రాష్ట్ర హక్కుల కోసం నాటి సీఎం వైఎస్‌ జగన్‌ పోరాటం  

సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి జస్టిస్‌ బచావత్‌ నేతృత్వంలోని గోదావరి జల వివాదాల ట్రిబ్యు­నల్‌(జీడబ్లూడీటీ) కేటాయించిన గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పునఃపంపిణీకి జీడబ్ల్యూడీటీ–2 ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి ని కేంద్రం తిరస్కరించింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా, గోదావరి జల వివాదాలపై ఉన్నత స్థాయి కమిటీని నియమించి సంప్రదింపులు జరుపుతున్నామని.. ఈ నేపథ్యంలో కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఈనెల 7న సీఎం చంద్రబాబుకు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ లేఖ రాయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై చంద్రబాబు సర్కార్‌ ఇప్పటివరకూ నోరుమెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం విడిపోయాక గోదావరి జలాల్లో ఏపీ వాటా ఎంత? తెలంగాణ వాటా ఎంత? అన్నది తేల్చలేదు. జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయినా సరే.. గోదావరిపై 2014–19 మధ్య కాళేశ్వరం, సమ్మక్కసాగర్, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులను తెలంగాణ సర్కార్‌ చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్‌ నోరు మెదపలేదు. 

గోదావరి జలాల్లో 967.94 టీఎంసీల వాటా తమకు ఉందని తెలంగాణ ప్రతిపాదిస్తూ.. అందులో 273.60 టీ­ఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి ఇచ్చేసినా నా­టి సీఎం చంద్రబాబు మౌనం వహించారు. దీన్ని నిరసిస్తూ నాటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో 2016, మే 16–18న జలదీక్ష చేశారు. కృష్ణా, గోదావరి జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టిన తీరును ఎండగట్టారు. 

అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో పోరాటం.. 
వైఎస్‌ జగన్‌ 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారంలో ఉండగా కృష్ణా, గోదావరి జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకోవడం కోసం సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేపట్టారు. గోదావరి జలాలపై హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. వాటి ఫలితంగా 2020 అక్టోబర్‌ 6న కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి జలాలపై రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆ సమావేశంలో వైఎస్‌ జగన్‌ రాజీలేని పోరాటం చేశారు. 

వాటి ఫలితంగా గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణల వాటా ఎంతో తేల్చుతామంటూ నాటి కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో హామీ ఇచ్చారు. గోదావరి జలాల్లో ఎవరి వాటా ఎంతో తేల్చే వరకూ తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ స్పష్టం చేసింది. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956 సెక్షన్‌–3 ప్రకారం ఫిర్యాదు చేస్తూ.. ఆ చట్టంలో సెక్షన్‌4(1) ప్రకారం గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ 2023, నవంబర్‌ 11న కేంద్ర జల్‌ శక్తి శాఖకు లేఖ రాసింది. అంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై కేంద్రం జాప్యం చేసింది. 

సీతారామకు సీడబ్ల్యూసీ గ్రీన్‌సిగ్నల్‌..
తెలంగాణ సర్కార్‌ 67.5 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవడానికి చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు 2025 ఏప్రిల్‌ 24న సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చేసినా చంద్రబాబు సర్కార్‌ నోరుమెదపలేదు. గోదావరి జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో గతేడాది డిసెంబర్‌ 18న గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖలపై గోదావరి పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్, కర్ణాటకల అభిప్రాయాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ కోరింది. 

గోదావరి జలాల వినియోగం విషయంలో తమకు ఏ రాష్ట్రంతో విబేధాలు లేనందున కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆ ఐదు రాష్ట్రాలు కేంద్రానికి తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి. గోదావరి జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్యే విబేధాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు పరిమితం చేస్తూ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలియజేశాయి. ఈ నేపథ్యంలో గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబుకు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ లేఖ రాశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement