అర్ధాకలితో ఏ బిడ్డా బడికి వెళ్లొద్దు | Bhatti Vikramarka reveals on the occasion of the launch of the breakfast scheme in schools | Sakshi
Sakshi News home page

అర్ధాకలితో ఏ బిడ్డా బడికి వెళ్లొద్దు

Jul 28 2026 4:00 AM | Updated on Jul 28 2026 4:00 AM

Bhatti Vikramarka reveals on the occasion of the launch of the breakfast scheme in schools

విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర భవిష్యత్‌: డిప్యూటీ సీఎం భట్టి 

ఉచిత పథకాలనేవి రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి 

పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం సందర్భంగా వెల్లడి

మధిర: ఉచిత పథకాలనేవి రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఉచిత పథకాలపై విమర్శ చేస్తున్నారన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఇతర అనేక అంశాలపై మాదిరిగానే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు సహా రాష్ట్ర ప్రజలందరిపై ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందని.. ఇవి వారు ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్లేందుకు దోహదం చేస్తాయని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలోని మార్కెట్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించి పిల్లలతో కలిసి టిఫిన్‌ చేశాక మాట్లాడారు.

పిల్లల మానసిక, శారీరక వికాసం కోసం...
రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌నే రాష్ట్ర భవిష్యత్‌గా భావిస్తూ ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం ఉదయమే రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ పథకాన్ని మధిర నియోజకవర్గంలో ప్రారంభించగా.. దశల వారీగా విస్తరిస్తామని తెలిపారు. 

సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలకు టిఫిన్‌ కట్టడమే తల్లిదండ్రులకు కష్టంగా మారిన ఈ రోజుల్లో, ప్రభుత్వ పాఠశాలల్లోని 20 లక్షల మంది, రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని 7 లక్షల మంది కలిపి 27 లక్షల మందికి ఒకే సమయానికి వేడివేడి అల్పాహారం అందించడం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమని తెలిపారు. హరేకృష్ణ మిషన్‌ భాగస్వామ్యంతో పకడ్బందీగా, శుభ్రమైన వాతావరణంలో మెకనైజ్డ్‌ కిచెన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు సత్య గౌరచంద దాస ప్రభూజీ, సీఈఓ కౌంతేయ స్వామీజీ, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఓటు హక్కు పోతే పౌరసత్వానికి ముప్పు
రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును పరిరక్షించడమే ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మధిర మండలం మాటూరుపేటలో ఆయన పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లు(బీఎల్‌ఏలు), వారి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. 

దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను కృత్రిమ మేధ ఆధారంగా గుర్తించి తొలగించే కుట్రలు జరుగుతున్నా యని భట్టి ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ తరహా చర్యల ద్వారా రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో రేషన్‌ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతలు, చివరికి దేశ పౌరసత్వం కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement