ఇక ఫ్యామిలీ రిజిస్టర్‌ | Details of all families in state are stored electronically in Telangana | Sakshi
Sakshi News home page

ఇక ఫ్యామిలీ రిజిస్టర్‌

Jul 28 2026 2:23 AM | Updated on Jul 28 2026 2:23 AM

Details of all families in state are stored electronically in Telangana

ఎల్రక్టానిక్‌ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాలు నిక్షిప్తం 

ప్రతి కుటుంబానికి చెందిన 8 అంశాలు నమోదు 

మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ 

ఈ సర్టిఫికెట్‌ ఎలాంటి హక్కులు కల్పించదు..లబ్ధి కలగదు 

ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కుటుంబాల వివరాలన్నింటినీ ఎల్రక్టానిక్‌ పద్ధతిలో నమోదు చేయడం ద్వారా ‘ఫ్యామిలీ రిజిస్టర్‌’రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రభుత్వ సేవలు పొందే విషయంలో కుటుంబ వివరాలకు సంబంధించిన నమ్మకమైన రికార్డును చూపించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని, కుటుంబ వివరాల పరిశీలనలో ఏకరూపత, సులభంగా అందుబాటులో ఉండటం లక్ష్యంగా రికార్డును రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌’ను ఏర్పాటు చేయడంతో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ జారీకి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ జారీ చేసిన జీవో నం:172 ప్రకారం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. 

– పౌరసరఫరాల శాఖ ద్వారా తీసుకునే డేటాబేస్‌లోని రేషన్‌కార్డులో ఉన్న కుటుంబ సమాచారాన్ని రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.  
–ఈ రిజిస్టర్‌ కానీ, సర్టిఫికెట్‌ కానీ దేనికీ అధీకృతం కాదు. కేవలం డేటాబేస్‌లో ఆ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు మాత్రమే ఉపయోపడుతుంది. దీని ద్వారా ఎలాంటి హక్కులూ దఖలు పడవు. ఆస్తులపై ఎలాంటి టైటిల్‌ రాదు. చట్టపరమైన వారసత్వాన్ని ధ్రువీకరించదు. ప్రభుత్వ పథకాల్లో లబి్ధకి ఉపయోగపడదు.  
–నిర్దేశించిన ఫీజును చెల్లించడం ద్వారా మీ సేవా కేంద్రం లేదా ఆన్‌లైన్‌ పోర్టల్‌ లేదా మొబైల్‌ అప్లికేషన్‌లో కుటుంబ సభ్యుడు ఈ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

–ఆ కుటుంబ వివరాల్లో పేరున్న మేజర్‌ అయిన సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
–దరఖాస్తు చేసుకున్న రెండు పని దినాల్లో సంబంధిత సర్టిఫికెట్‌ను జారీ చేయాల్సి ఉంటుంది.  
–రేషన్‌కార్డులో నమోదై ఉన్న చిరునామా ఆధారంగా సదరు తహశీల్దార్‌ ఈ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. మీసేవా కేంద్రం నుంచి తహశీల్దార్‌ లాగిన్‌లోకి నేరుగా దరఖాస్తు వెళుతుంది.  

–రేషన్‌కార్డులో నమోదై ఉన్న అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత తన డిజిటల్‌ సంతకంతో సంబంధిత తహశీల్దార్‌ ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్‌పై ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ కూడా ఉంటుంది. మీ సేవా కేంద్రాల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశముంటుంది.  
–ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ)ను ఏర్పాటు చేసే బాధ్యత ఎల్రక్టానిక్‌ సరీ్వస్‌ డెలివరీ (ఈఎస్‌డీ) కమిషనర్‌కు అప్పగించారు. రేషన్‌కార్డుల్లోని వివరాలను పౌరసరఫరాల శాఖ సహకారంతో తీసుకుంటారు. ఈ ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ సేవ అమలును ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. 

ఫ్యామిలీ రిజిస్టర్‌లో నమోదు చేసే కుటుంబ వివరాలివే: 
1) ఫ్యామిలీ రిజిస్టర్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (ఆ కుటుంబ రేషన్‌కార్డు నంబర్‌) 
2) కుటుంబ యజమాని పేరు 
3) కుటుంబ సభ్యులందరి పేర్లు 
4) యజమానితో కుటుంబ సభ్యుల బంధుత్వం 
5) ప్రతి సభ్యుడి వయసు, పుట్టినరోజు 
6) పురుషుడు/స్త్రీ/ఇతరులు 
7) ప్రతి సభ్యుడి ఆధార్‌ కార్డు 
8) ఇంటి నంబర్, వీధి, గ్రామం/వార్డు, గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ, మండలం, జిల్లాతో కూడిన కుటుంబ చిరునామా.  

‘సర్‌’కూ ఇది ఉపయుక్తం 
సర్‌ 2026 ప్రక్రియలో భాగంగా ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్‌ ఫారాలను ఓటర్ల నుంచి స్వీకరించి.. ఆగస్టు 10వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ముసాయిదా జాబితాలో పేర్లు వచ్చిన వారి వివరాల్లో తేడాలు ఉంటే ఆగస్టు 10 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు నోటీసులు జారీ చేసి ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు(ఈఆర్‌వో) విచారణకు పిలుస్తారు. విచారణకు హాజరైన వారు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. అందులో 10వ పత్రంగా ఈ ‘ఫ్యామిలీ రిజిష్టర్‌’సర్టిఫికెట్‌ కూడా ఉంది. ఏ పత్రాలు లేని వారికి ఇది ఉపయోగపడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement