కూకట్‌పల్లిలోని నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు (ఫైల్)
హైడ్రా చర్యలతో నిరుపేదలు నష్టపోయారనే విమర్శలు
తీవ్ర వివాదాస్పదంగా చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాల పరిరక్షణ
నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు
కొన్నిచోట్ల వస్తువులు, పుస్తకాలు తీసుకోవడానికి సైతం సమయం ఇవ్వలేదన్న బాధితులు
లోతుకుంట భూముల వివాదంతో పతాక స్థాయికి!
సాక్షి, హైదరాబాద్: చెరువుల ఫుల్‌ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), ప్రభుత్వ భూములు, నాలా పరిరక్షణ పేరుతో హైడ్రా వేసిన ప్రతి అడుగుతోనూ నిరుపేదలే నష్టపోయారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సరైన సమాచారం లేకుండా, కొన్నిసార్లు కనీసం ఇంట్లోని వస్తువులు, పుస్తకాలూ కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టి పేదల కన్నీటికి, తీరని వేదనకు కారణమయ్యిందనే విమర్శలు ఉన్నాయి. సున్నం చెరువుతో ప్రారంభిస్తే అనేక కూల్చివేతల్లో నిరుపేదలు గూడు కోల్పోయి కట్టబట్టలతో మిగిలారు.
హైడ్రా కూల్చివేతల్లో అత్యంత వివాదాస్పదమైన అంశం సున్నం చెరువు కూల్చివేతలు. మాదాపూర్‌లో ఉన్న ఈ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాల పేరుతో హైడ్రా 2024 సెప్టెంబర్‌లో కూల్చివేతలు చేపట్టింది. ఈ సందర్భంలో స్థానికులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. అప్పట్లో చిన్నారులు గూడుతో పాటు పుస్తకాలను సైతం కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ‘నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని’ హైడ్రా ప్రత్యేక వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
రోడ్డున పడిన వందల కుటుంబాలు
అమీన్‌పూర్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన విల్లాలు, భవనాలతో పాటు షెడ్లను సైతం హైడ్రా కూల్చివేసింది. ఇక్కడా బాధితులు నోటీసులు లేకుండానే కూల్చివేతలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కూకట్‌పల్లి నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న షెడ్లు, వాణిజ్య నిర్మాణాలు, ఇతరాలను హైడ్రా తొలగించింది. ఈ సందర్భంలోనూ బాధితులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువు వద్దా ఇలాంటిదే జరిగింది.
గాజుల రామారం సర్వే నం.307 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 350 ఎకరాలు కేటాయించింది. ఈ స్థలంలో పేదలు ఇల్లు కట్టుకోగా అక్టోబర్ 2025లో హైడ్రా 800కు పైగా నిర్మాణాలను తొలగించింది. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదిలా ఉంటే అదే సర్వే నంబర్‌లో ప్రగతినగర్ ఆనుకొని ఓ ఎమ్మెల్యే 30 ఎకరాల వరకు స్థలాన్ని కబ్జా చేయగా హైడ్రా అడ్డుకుంది. అయితే తెల్లారేసరికే అదే స్థలం చుట్టూ ఎమ్మెల్యే మనుషులు ఫెన్సింగ్ వేయగా హైడ్రా ఇంతవరకు వారి పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఫాతిమా కాలేజీ వ్యవహారంలో ద్వంద్వ వైఖరి
ఫాతిమా కాలేజీ (బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్) వివాదం హైడ్రా చేపట్టిన చెరువుల ఆక్రమణల తొలగింపు చర్యల్లో అత్యంత చర్చనీయాంశమైంది. చాంద్రాయణగుట్టలోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కళాశాల ఉందనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయవాది విజయ్ గోపాల్ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో ఉందని, అయినప్పటికీ హైడ్రా ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలు చేపడుతున్నట్టుగా ఇక్కడ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
దీని విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పాఠశాల విద్యాశాఖ అధికారులను పలుమార్లు ప్రశ్నించింది. కళాశాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎఫ్‌టీఎల్ హద్దులు ఏమిటి? నిర్మాణం ఎలా అనుమతించబడింది? అనే అంశాలపై పూర్తి రికార్డులు సమర్పించాలని ఆదేశించింది. అధికారులు పలుమార్లు పూర్తి వివరాలు సమర్పించకపోవడంతో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో హైడ్రాపై ‘ఎంపిక చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటోంది‘ అనే విమర్శలు వచ్చాయి.
చెరువుల ఎఫ్‌టీఎల్‌లో ఉన్న చిన్న ఇళ్లు, వాణిజ్య భవనాలను కూల్చుతున్న హైడ్రా, ఈ విద్యాసంస్థపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు, కొందరు ప్రజాప్రతినిధులు, పిటిషనర్ వాదించారు. రాజకీయ ప్రభావం కారణంగానే చర్యలు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపించాయి. అలాగే మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పేరుతో ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తాల్లో ఇళ్లు కూల్చివేస్తారనే ప్రచారంతో వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా వెళ్లి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఎన్ని మొట్టికాయలో..!
కూకట్‌పల్లిలోని ఎన్‌వీఎన్ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన కేసులోనూ హైడ్రా వివాదాస్పదమైంది. కోర్టు రక్షణలో ఉన్న భూమిలో కూల్చివేతలు, కాంపౌండ్ తొలగింపు, విద్యుత్ కనెక్షన్ నిలిపివేత జరిగాయని ఆరోపణలు రావడంతో భూమిని మునుపటి స్థితికి తీసుకురావాలని రెవెన్యూ, హైడ్రా అధికారులను హైకోర్టు ఆదేశించింది. గుడిమల్కాపూర్‌లోని ఓ భూమికి సంబంధించి పాత కోర్టు డిక్రీలు ఉన్నప్పటికీ హైడ్రా షెడ్ కూల్చి ఫెన్సింగ్ వేసిందనే ఆరోపణలు వచ్చాయి.
ఈ వివాదంపై ఘాటుగా స్పందించిన కోర్టు ఫెన్సింగ్ తొలగించి స్టేటస్‌కో కొనసాగించాలని ఆదేశించింది. బహదూర్‌గూడలో రైతులు వ్యవసాయం చేస్తున్న భూములకు హైడ్రా ఫెన్సింగ్ వేసిందని పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఐలాపూర్ (అమీన్‌పూర్) భూముల కేసులో స్టేటస్‌కో ఉల్లంఘించారని హైడ్రా కమిషనర్‌తో పాటు ఇతర అధికారులకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇక లోతుకుంటలో శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కేసులో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా జోక్యం చేసుకుందని సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఇదే కేసు విచారణ చివరకు కమిషనర్‌ను తొలగించాలనే ఆదేశాలకు దారితీసింది.
మెడకు చుట్టుకున్న ‘లోతుకుంట’ వివాదం
హైడ్రా తన రెండేళ్ల ప్రస్తానంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా లోతుకుంట భూముల వివాదంతో హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం రేవంత్‌రెడ్డి 2024 జూలై 12న హైడ్రా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే నెల 19 నుంచి అది అమలులోకి వచ్చింది. అంబర్‌పేటలోని బతుకమ్మకుంట విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఆదేశాలను ఉల్లంఘిస్తూ హైడ్రా పనులు చేపట్టిందనే ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ రంగనాథ్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయస్థానం పేర్కొంది. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, నిర్మాణాలు తొలగించి, నాలుగు వారాల్లో అమలు నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో హైడ్రా చర్యలు తీసుకుంది.


