ఏసీబీ అధికారులకు చిక్కిన జీపీఓ జగదీశ్
రూ.2 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీఓ
వికారాబాద్ జిల్లా మోత్కూరులో ఘటన
దోమ: కల్యాణలక్ష్మి పథకం కోసం రూ. 2 వేలు లంచం తీసుకుంటూ ఓ గ్రామ పాలన అధికారి ఏసీబీకి చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నా యి.. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరుకు చెందిన ఎర్రోళ్ల ఎల్లమ్మ ఇటీవల కూతురు కవిత వివాహం చేశారు. కల్యాణలక్ష్మి పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, స్థానిక జీపీఓ జగదీశ్‌ను ఆశ్రయించారు.
పంచనామా నిర్వహించేందుకు రూ. 6 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో, ఈ విషయాన్ని స్థానికులతో చెప్పింది. వారి సూచన మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జీపీఓకు రూ.2 వేలు ఇవ్వగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని దోమ తహసీల్ ఆఫీసుకు తీసుకెళ్లి విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.


