సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోతుకుంట భూవివాదంలో హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని ఆర్మీని ఆదేశించింది.
వివాదాస్పద భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవ్వరొచ్చినా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే హైడ్రా పనితీరును పలుమార్లు తీవ్రంగా మందలించిన హైకోర్టు, మళ్లీ ఆర్మీ భూములను టచ్ చేస్తే తమకు చెప్పాలని పేర్కొంది. గురువారం లోతుకుంట భూములపై జరిగిన విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ హెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఒకవేళ కోర్టు ధిక్కరణ ఇలాగే కొనసాగితే అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని, అవసరమైతే హైడ్రా కమిషనర్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచడానికి కూడా వెనకాడబోమని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
శాంతిభద్రతల పరిరక్షణ, కోర్టు ఆదేశాల అమలు కోసం వివాదాస్పద భూమి దగ్గర ఆర్మీ బలగాలు మోహరించాలని హైకోర్టు సూచించింది. సదరు భూములకు రక్షణగా 10 మంది జవాన్లను కాపలా ఉంచాలని ఆదేశించింది. ఒకవేళ కోర్టు స్టే ఆర్డర్లను ఉల్లంఘించి హైడ్రా అధికారులు అక్కడకు వస్తే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, వారు వచ్చే హైడ్రా వాహనాలను కూడా వెంటనే సీజ్ చేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


