సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాష్‌రూమ్‌లో గన్‌తో కాల్చుకుని మృతి చెందాడు. కాగా, స్వామి.. గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
కాగా, కానిస్టేబుల్ స్వామి సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తన లెటర్‌లో..‘నా భర్య పిల్లలను ఏమీ అనవద్దు. దెయ్యం అయినా కూడా వాళ్లను చూసుకుంటాను’ అని సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు. అయితే, స్వామి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే డీజీపీ ఆఫీసుకు చేరుకుని ఆత్మహత్య స్థలాన్ని ఫొరెన్సిక్, క్లూస్ టీం అధికారులు పరిశీలించారు. స్వామి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాసేపట్లో ఉస్మానియా మార్చురీకి స్వామి మృతదేహాన్ని తరలించనున్నారు.


