పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు 13వ స్థానం
పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 10వ ర్యాంకు..గుజరాత్‌కు అగ్రస్థానం
ప్రభుత్వ విధానాలు, వ్యాపార అనుకూలత, ఆర్థిక ఆరోగ్యంలో రాష్ట్రానికి మంచి మార్కులు
మౌలిక సదుపాయాల కల్పన,సంస్థాగత వాతావరణంలో మైనస్ మార్కులు
నీతి ఆయోగ్ ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్–2026’ నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం అంశంలో వివిధ కేటగిరీలు కలిపి తెలంగాణకు 100కు 47.3 మార్కులు వచ్చాయి. తద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రానికి 13వ ర్యాంకు లభించింది. అలాగే దేశంలోని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 10వ ర్యాంకు లభించింది. ఈ మేరకు నీతి ఆయోగ్.. ‘పెట్టుబడులకు సంబంధించిన స్నేహ పూర్వక వాతావరణం సూచిక–2026’ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా గుజరాత్‌కు అగ్రస్థానం లభించింది. టాప్ 5 రాష్ట్రాల్లో గుజరాత్ (56.6 మార్కులు), మహారాష్ట్ర (53.7), తమిళనాడు (53.3), ఒడిశా (52.4), మధ్యప్రదేశ్ (48.9) ఉండగా, ఆంధ్రప్రదేశ్ (48.7), కర్ణాటక (48.7), రాజస్తాన్ (48.1), ఛత్తీస్‌గఢ్ (47.5 మార్కులు) రాష్ట్రాలు తెలంగాణ కంటే ముందు వరుసలో నిలిచాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతపై ఆరు కేటగిరీల్లో పరిశీలన జరిపిన అనంతరం నీతి ఆయోగ్ ఈ మేరకు ర్యాంకులు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలు తెలంగాణకు సానుకూలంగా ఉండగా, మరికొన్ని ప్రతికూలంగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించడం గమనార్హం.
టీఎస్–ఐపాస్‌కు గుర్తింపు
పెట్టుబడులకు వివిధ రాష్ట్రాల్లో అనుకూలత విషయంలో పలు అంశాల్లో నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. మొత్తం 84 సూచికల్లో 1,850 మంది పెట్టుబడిదారుల అభిప్రాయాలు, 165 భాగస్వామ్య సంస్థల సూచనలను పరిగణనలోకి తీసుకుంది. దీంతో పాటు కీలకమైన మౌలిక వసతుల కల్పన, వ్యాపార అనుకూల వాతావరణం, వనరులు, ప్రభుత్వ విధానాలు, సౌలభ్యాలు, ఆర్థిక ఆరోగ్యం, సంస్థాగత వ్యవస్థ, పర్యావరణ స్థిరత్వం వంటి సూచికల్లో పాయింట్లు కేటాయించింది. ప్రభుత్వ విధానాలు, వ్యాపార అనుకూల పరిస్థితులు, ఆర్థిక ఆరోగ్యం కేటగిరీల్లో ఈ నివేదిక తెలంగాణకు మంచి మార్కులు ఇచ్చింది. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన సింగిల్ విండో వ్యవస్థల్లో టీఎస్–ఐపాస్ ఒకటిగా ఈ నివేదిక గుర్తించింది. దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉండటం, కాజీపేట, సనత్‌నగర్ ప్రాంతాల్లో సరుకు రవాణా సామర్థ్యం పెరగడం వల్ల పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని తెలిపింది. 
సేవా రంగం ప్రధాన బలం
రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో సేవారంగం ప్రధాన బలంగా నిలుస్తోందని, తెలంగాణలో తలసరి జీఎస్‌డీపీ రూ.2,17,801గా ఉండగా, పరిశ్రమల వాటా 22.5 శాతం, సేవారంగం వాటా 69.3 శాతంగా నమోదైందని, 3.03 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని, ఔషధాలు, మెడిసినల్ కెమికల్స్, బయోటెక్ రంగాలు తెలంగాణ ప్రధాన పరిశ్రమలుగా ఉన్నాయని పేర్కొంది. తెలంగాణకు పారిశ్రామిక బలాలతో పాటు బలహీనతలు కూడా ఉన్నాయని, సంస్థాగత వాతావరణం, మౌలిక సదుపాయాల కల్పన విభాగాల్లో రాష్ట్రం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. విరివిగా భూముల లభ్యత ఉన్నా 2022 నాటికే సైబర్, ఆర్థిక నేరాలతో ప్రతికూల వాతావరణం ఏర్పడిందని తెలిపింది. పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారడం, సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, ప్రభుత్వ సేవల నాణ్యతను మరింత బలోపేతం చేయడం ద్వారా పెట్టుబడులను ఇంకా పెద్దఎత్తున ఆకర్షించే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది.


