breaking news
state rankings
-
100కు 47.3 మార్కులు.. తెలంగాణకు 13వ స్థానం
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం అంశంలో వివిధ కేటగిరీలు కలిపి తెలంగాణకు 100కు 47.3 మార్కులు వచ్చాయి. తద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రానికి 13వ ర్యాంకు లభించింది. అలాగే దేశంలోని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 10వ ర్యాంకు లభించింది. ఈ మేరకు నీతి ఆయోగ్.. ‘పెట్టుబడులకు సంబంధించిన స్నేహ పూర్వక వాతావరణం సూచిక–2026’ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా గుజరాత్‌కు అగ్రస్థానం లభించింది. టాప్ 5 రాష్ట్రాల్లో గుజరాత్ (56.6 మార్కులు), మహారాష్ట్ర (53.7), తమిళనాడు (53.3), ఒడిశా (52.4), మధ్యప్రదేశ్ (48.9) ఉండగా, ఆంధ్రప్రదేశ్ (48.7), కర్ణాటక (48.7), రాజస్తాన్ (48.1), ఛత్తీస్‌గఢ్ (47.5 మార్కులు) రాష్ట్రాలు తెలంగాణ కంటే ముందు వరుసలో నిలిచాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతపై ఆరు కేటగిరీల్లో పరిశీలన జరిపిన అనంతరం నీతి ఆయోగ్ ఈ మేరకు ర్యాంకులు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలు తెలంగాణకు సానుకూలంగా ఉండగా, మరికొన్ని ప్రతికూలంగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించడం గమనార్హం. టీఎస్–ఐపాస్‌కు గుర్తింపు పెట్టుబడులకు వివిధ రాష్ట్రాల్లో అనుకూలత విషయంలో పలు అంశాల్లో నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. మొత్తం 84 సూచికల్లో 1,850 మంది పెట్టుబడిదారుల అభిప్రాయాలు, 165 భాగస్వామ్య సంస్థల సూచనలను పరిగణనలోకి తీసుకుంది. దీంతో పాటు కీలకమైన మౌలిక వసతుల కల్పన, వ్యాపార అనుకూల వాతావరణం, వనరులు, ప్రభుత్వ విధానాలు, సౌలభ్యాలు, ఆర్థిక ఆరోగ్యం, సంస్థాగత వ్యవస్థ, పర్యావరణ స్థిరత్వం వంటి సూచికల్లో పాయింట్లు కేటాయించింది. ప్రభుత్వ విధానాలు, వ్యాపార అనుకూల పరిస్థితులు, ఆర్థిక ఆరోగ్యం కేటగిరీల్లో ఈ నివేదిక తెలంగాణకు మంచి మార్కులు ఇచ్చింది. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన సింగిల్ విండో వ్యవస్థల్లో టీఎస్–ఐపాస్ ఒకటిగా ఈ నివేదిక గుర్తించింది. దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉండటం, కాజీపేట, సనత్‌నగర్ ప్రాంతాల్లో సరుకు రవాణా సామర్థ్యం పెరగడం వల్ల పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని తెలిపింది. సేవా రంగం ప్రధాన బలం రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో సేవారంగం ప్రధాన బలంగా నిలుస్తోందని, తెలంగాణలో తలసరి జీఎస్డీపీ రూ.2,17,801గా ఉండగా, పరిశ్రమల వాటా 22.5 శాతం, సేవారంగం వాటా 69.3 శాతంగా నమోదైందని, 3.03 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని, ఔషధాలు, మెడిసినల్ కెమికల్స్, బయోటెక్ రంగాలు తెలంగాణ ప్రధాన పరిశ్రమలుగా ఉన్నాయని పేర్కొంది. తెలంగాణకు పారిశ్రామిక బలాలతో పాటు బలహీనతలు కూడా ఉన్నాయని, సంస్థాగత వాతావరణం, మౌలిక సదుపాయాల కల్పన విభాగాల్లో రాష్ట్రం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. విరివిగా భూముల లభ్యత ఉన్నా 2022 నాటికే సైబర్, ఆర్థిక నేరాలతో ప్రతికూల వాతావరణం ఏర్పడిందని తెలిపింది. పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారడం, సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, ప్రభుత్వ సేవల నాణ్యతను మరింత బలోపేతం చేయడం ద్వారా పెట్టుబడులను ఇంకా పెద్దఎత్తున ఆకర్షించే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. -
వారంలో ‘నీట్’ రాష్ట్ర స్థాయి ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల్లోగా ‘నీట్’రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ‘నీట్’ర్యాంకుల ప్రకటన అనంతరం రాష్ట్ర స్థాయిలో తమకెంత ర్యాంకు వస్తుందోనన్న ఆసక్తి, ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. తెలంగాణ నుంచి 48,996 విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 33,044 మంది అర్హత సాధించారు. వారిలో చాలామంది జాతీయస్థాయిలో వచ్చిన వేలాది ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారు. కానీ రాష్ట్రస్థాయిలో ర్యాంకులు తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. నీట్ నిపుణుల అంచనా ప్రకారం జాతీయస్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు, రాష్ట్ర స్థాయిలో 1,500 నుంచి 2 వేల లోపు ర్యాంకులే వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో లక్ష వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ ఎంబీబీఎస్ సీటు వస్తుందంటున్నారు. నీట్లో 460 నుంచి 470 మార్కుల వరకు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉందని శ్రీచైతన్య కూకట్పల్లి జూనియర్ కాలేజీ డీన్ శంకర్రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం ఈ నెల 20 నాటికి మొదటి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. జూలై చివరి నాటికి కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేసి ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో 4,600 ఎంబీబీఎస్ సీట్లు.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019–20 వైద్య విద్యా సంవత్సరానికి 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇవికాక 10 ప్రైవేటు, ఒక ఆర్మీ, మరో ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 1,106 డెంటల్ సీట్లున్నాయి. గతేడాది కంటే ఈసారి ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 1,000 పెరిగాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న 1,500 సీట్లల్లో 15 శాతం అంటే 225 సీట్లు అఖిల భారత కోటా కింద కేంద్రం భర్తీ చేస్తుంది. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్రం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ రిజర్వేషన్ అమలు చేయాలంటే ప్రస్తుత రిజర్వేషన్లు దెబ్బతినకుండా ఉంచాలి. అలాగైతే 25 శాతం సీట్లు పెంచాలి. ఆ మేరకు ప్రస్తుత సీట్లకు అదనంగా 375 సీట్లు పెరగాల్సి ఉంటుంది. అవే పెరిగితే మొత్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,875 సీట్లు అవుతాయి. వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల పెంపుపై ప్రతిపాదనలు పంపాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపే పనిలో వైద్య విద్య డైరెక్టరేట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలంటే నోటిఫికేషన్ విడుదల లోపు దీనిపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆ సీట్లు అందుబాటులోకి వస్తాయి. లేదంటే అంతే సంగతులు. అందుకోసమే నోటిఫికేషన్‌ను కొద్దిగా ఆలస్యంగా జారీచేయాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం భావిస్తోంది. -
క్యాడెట్ చాంప్స్ వరుణ్, అంజలి
సెయింట్ పాల్స్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ అకాడమీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణ్, అంజలి విజేతలుగా నిలిచారు. క్యాడెట్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను గ్లోబల్ టీటీ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన బి.వరుణ్ శంకర్ కైవసం చేసుకున్నాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ట్రోఫీని ఎన్.అంజలి గెలుచుకుంది. హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో శనివారం జరిగిన క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో వరుణ్ 11-6, 11-7, 11-8తో అద్వైత్ (ఆనంద్‌నగర్ వెల్పేర్ అసోసియేషన్)పై విజయం సాధించాడు. బాలికల ఫైనల్లో అంజలి (గుజరాతీ సేవా మండలి) 11-8, 11-6, 11-1తో రుచిరా రెడ్డి (ఎస్‌పీటీటీఏ)పై గెలిచింది. స్నేహిత్‌కు సబ్-జూనియర్ టైటిల్ సబ్-జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను నిరుటి విజేత ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్(జీటీటీఏ) నిలబెట్టుకున్నాడు. సబ్-జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో జి.ప్రణీత (జీఎస్ఎం) ఫైనల్లోకి చేరింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 11-4, 13-11, 11-4, 11-6తో సాయి తేజస్ (ఎస్‌పీటీటీఏ)పై నెగ్గాడు. బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణీత 11-4, 7-11, 11-9, 11-7, 7-11, 12-10తో పోరాడి వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)పై నెగ్గింది. టీమ్ చాంపియన్ ఎస్బీఐ ఇంటర్ ఇనిస్టిట్యూషన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎస్బీఐ జట్టు 3-2తో పోస్టల్ డిపార్ట్మెంట్ జట్టుపై గెలిచింది.


