కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు | KTR lashes out at Congress over Kaleshwaram project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు

Jul 28 2026 3:52 AM | Updated on Jul 28 2026 3:52 AM

KTR lashes out at Congress over Kaleshwaram project

కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ధ్వజం 

నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నారైతులకు అందించడం లేదు 

కాళేశ్వరంపై ఇచ్చింది ఎన్‌డీఏ రిపోర్ట్‌ అంటూ ఎద్దేవా 

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద తగిన నీటి మట్టం ఉన్నందున పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు అందించడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో గ్రౌటింగ్‌ పూర్తయిన తర్వాత పరిమిత స్థాయిలో నీటిని నిల్వ ఉంచి మూడు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రిటైర్డ్‌ ఇంజినీర్లు సూచించారని తెలిపారు.

సోమవారం కేటీఆర్‌ ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే 48 గంటల్లో నివేదిక ఇచ్చారని, అందుకే దానిని బీఆర్‌ఎస్‌ ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌ కాదుం ఎన్‌డీఏ రిపోర్ట్‌ అని ఎద్దేవా చేశారు. రూ.8.5 కోట్లతో కాఫర్‌ డ్యామ్‌ నిర్మిస్తే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి సాధ్యం కాకపోవడంతోనే నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్‌ చేశామని చెప్పారు.  

ఐటీ ఉద్యోగాలు తగ్గాయి 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని కేటీఆర్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం ఐటీ టవర్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వకపోవడంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శించారు. టీ–ఫైబర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. 

కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయాయని కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్‌–కరీంనగర్‌ రైల్వే మార్గం విద్యుద్దీకరణతోపాటు మిడ్‌ మానేరు వద్ద రైల్వే కమ్‌ రోడ్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ సాధించిన విజయం తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచానికి చాటిందని కేటీఆర్‌ అన్నారు.  

అర్ధరాత్రి బీజేపీతో కాంగ్రెస్‌ దోస్తీ:  
ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉందని, అర్ధరాత్రి వేళల్లో కాంగ్రెస్‌ నేతలు బీజేపీ నాయకులతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నివాసంలో ఈడీ సోదా లు జరిగినా వివరాలు బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్కడ దొరికిన నగదును లెక్కించడానికి మిషన్లు కూడా సరిపోవట్లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement