ఏసీబీ వద్ద భారీ అవినీతి అధికారుల చిట్టా
ప్రభుత్వ అనుమతి మేరకు.. ఆకస్మిక దాడులకు సిద్ధం
ఇటీవలి కాలంలో దాడుల జోరు పెంచిన అవినీతి నిరోధక సంస్థ
ఒక్కొక్కరి వద్ద వందల కోట్లలో ఆస్తులు బహిర్గతం
ఏసీబీ అధికారులే విస్తుపోతున్న వైనం
సాక్షి, హైదరాబాద్: అవినీతి పుట్టల్లో దాగున్న కట్టల పాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి అధికారు లపై ఇటీవల అవినీతి నిరోధకశాఖ అధికా రులు దాడుల జోరు పెంచారు. ఆదాయా నికి మించిన ఆస్తుల కేసులలో ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి అధికారులు అక్ర మార్జనలో రికార్డుల మోత మోగిస్తున్నారు. ఒకరికి మించి ఇంకొకరు అన్నట్టుగా ఏసీబీ చరిత్రలోనే అత్యధిక అవినీతి మొత్తాలు బయటపడు తుండడంతో అధికారులే నోళ్లు వెల్లబెడుతున్నారు. ఈనెల 22 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన రెడ్కో డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారమే రూ.27.65 కోట్లుగా ఏసీబీ ప్రకటించింది.
ఏసీబీ చరిత్రలో ఇదే అతిపెద్ద కేసు కావడం గమనార్హం. కాగా గత మూడు నెలల్లోనే పలు భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ తిమింగలాల పట్టివేత ఇంకా ముగియలేదని, కీలక ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మరో 50 మందికి పైగా ‘భారీ అవినీతి’ అధికారుల వివరాలతో కూడిన హిట్‌లిస్ట్ ఏసీబీ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి ప్రకారం..వీరిపైనా ఆకస్మిక దాడులు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
నగదు.. బంగారం.. భవనాలు.. స్థలాలు
గత కొద్ది నెలలుగా ఏసీబీ దూకుడు పెంచింది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసుల్లో పలువురు ఉన్న తాధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించి భారీగా నగదు, బంగారం, విలాసవంత మైన భవనాలు, విల్లాలు, వ్యవ సాయ భూములు, వాణిజ్య సముదాయాలను గుర్తిస్తు న్నా రు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, హెచ్‌ఎండీఏ, ఆర్టీఏ, జీహెచ్‌ఎంసీ విభాగాల్లో అవినీతిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏసీబీ గణాంకాల ప్రకారం, 2025లో ఏడాది మొత్తం 15 ఆదాయా నికి మించిన ఆస్తుల కేసులు నమోదు కాగా..2026 జూలై 24 నాటికే 16 కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా ఏ అధికారి పట్టుబడినా కిలోల కొద్ది బంగారం, లగ్జరీ కార్లు. ఖరీదైన మద్యం బాటిళ్లు, కోట్లలో బ్యాంకు బ్యాలెన్స్, బ్యాంకు లాకర్లలో ఆస్తుల పత్రాలు సర్వసాధారణ మయ్యాయి.
సొమ్ము దాచేందుకు సరికొత్త దారులు
అక్రమార్జన ద్వారా వచ్చిన సొత్తును దాచేందుకు వాటి విలువ పెంచుకునేందుకు అవినీతి అధికారులు ఎప్పటి కప్పుడు సరికొత్త దారులు వెతుకుతున్నారు. కొందరు బినా మీల పేరిట రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. వారి పేరిట వ్యవసాయ భూములు, కమర్షియల్ స్థలాలు, విల్లాలు కొంటున్నారు. కొందరు ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు ఇతర వ్యాపారాలు, కుటుంబ సభ్యుల పేరిట షెల్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా సొమ్ము మళ్లిస్తున్నారు.
ఇటీవల ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల ప్రధాన కేసులు..
» ఈ నెల 22న రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు చెందిన అక్రమాస్తులు అధికారిక లెక్కల ప్రకారమే రూ.27.65 కోట్లు కాగా..బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
» ఈనెల 14న హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. పట్టు బడిన ఆస్తుల విలువ దాదాపు రూ.90 కోట్లుగా అంచనా.
» ఈ నెల 2న డీజీపీ కార్యాలయంలో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. జూలై 2న 16 ప్రాంతాల్లో సోదాలు చేసి..విల్లాలు, ఫ్లాట్లు, కమర్షియల్ భవనాలు, పలు చోట్ల వ్యవసాయ భూములు గుర్తించారు. బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేశారు.
» జూన్ 16న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుపై డీఏ కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాల్లో రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ విలువ ప్రకారం రూ.13 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించగా..వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు అని అంచనా.
» జూన్ 23న నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన
ఆస్తుల కేసుతో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. రూ.3 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
» జూన్ 9న ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మొత్తం 16 ప్రాంతాల్లో సోదాలు చేయగా.. అధికారిక లెక్కల ప్రకారం రూ.17.94 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా.


