సామర్థ్యం పెంచాలన్న తెలంగాణ విజ్ఞప్తికి ఏపీ అభ్యంతరం
ఆర్డీఎస్ ఆధునీకరణకు ఓకే అన్న ఏపీ
తుంగభద్ర బేసిన్ సమస్యలపై హైపవర్ కమిటీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరింది. ఆర్డీఎస్ ఆనకట్టలో పూడిక తొలగించడంతోపాటు ఎత్తు పెంచాలని చెప్పింది. ఆర్డీఎస్ ఆధునీకరణతోపాటు పూడిక తొలగింపునకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎత్తు పెంపు, సామర్థ్యం పెంపును ససేమిరా అంగీకరించమని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది.
తుంగభద్ర పరీవాహక ప్రాంత సమస్యల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ పైథాంకర్ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల అధికారులతో కేంద్రం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తొలి సమావేశం సోమవారం వర్చువల్‌గా జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) రమేశ్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ (ఇరిగేషన్) నరసింహమూర్తి, కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి బీఎస్ శివకుమార్ ఈ సమావేశంలో హాజరై తమ రాష్ట్రాల వాదనలను వినిపించారు. ఆర్డీఎస్ ద్వారా తమ రాష్ట్రానికి రావాల్సిన వాటా నీళ్లు అందడం లేదని, తక్షణమే ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. హైపవర్ కమిటీ విధివిధానాలపై తమ అభిప్రాయాన్ని 15 రోజుల్లోగా తెలియజేస్తామని తెలంగాణ పేర్కొంది.
తుంగభద్ర డ్యామ్‌లో పూడిక తొలగింపునకు ఓకే..
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలో పూడికతో నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని, పూడిక తొలగించాలని, లేకుంటే ఎగువన తుంగభద్ర నదిపై నావళి వద్ద 33 టీఎంసీలతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని కర్ణాటక కోరగా, రిజర్వాయర్ నిర్మాణానికి ఏపీ, తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేశాయి. తుంగభద్ర జలాశయంలో పూడిక తొలగింపు చేపట్టడానికి ఏపీ, తెలంగాణ మద్దతు తెలిపాయి. దీంతో పూడిక తొలగింపుపై అధ్యయనం కోసం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. హైపవర్ కమిటీ తదుపరి సమావేశం ఢిల్లీలో నిర్వహించాలని, సభ్యులందరూ భౌతికంగా పాల్గొనాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.


