డీఎస్సీ అక్రమాలపై విచారణ | AP High Court orders state govt Investigation into DSC irregularities | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై విచారణ

Jul 28 2026 5:12 AM | Updated on Jul 28 2026 5:12 AM

AP High Court orders state govt Investigation into DSC irregularities

మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

జూడో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలపై పిల్‌ 

నాలుగు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలి 

ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం 

ఈ నకిలీ పత్రాలతోనే ప్రభుత్వ ఉద్యోగాలు.. మెడికల్‌ సీట్లు..  

ఇవే తప్పుడు పత్రాలతో డీఎస్సీలోనూ ఉద్యోగాలు 

ఇదో పెద్ద కుంభకోణం.. దీని వెనుక కుట్రకోణం 

ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన పిటిషనర్‌

సాక్షి, అమరావతి: లక్షలాది మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్‌ను గందరగోళంలోకి నెట్టిన మెగా డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పోర్ట్స్‌ కోటా ముఖ్యంగా జూడో క్రీడా విభాగంలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య విద్య ప్రవేశాలు పొందుతున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. 2025 మెగా డీఎస్సీలో  నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారని, దీనిపై ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.పురుషోత్తం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  పిటిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదులు, రిట్‌ పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై నాలుగు నెలల్లోతగిన నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఫిర్యాదులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు...
అంతకు ముందు పురుషోత్తం తరఫున సీనియర్‌ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ జూడో అసోసియేషన్‌ నుంచి నకిలీ ధృవీకరణ పత్రాలు పొంది పలువురు పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారని, అలాగే 2025 డీఎస్‌సీలో కూడా ఉద్యో­గాలు సంపాదించారన్నారు. అంతేకాక వైద్య విద్యలో కూడా ప్రవేశాలు పొందారని తెలిపారు. వీటన్నింటిపై పిటిషనర్‌ ఫిర్యాదులు చేసినా ప్రభు­త్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఆరోపణలకు ఆధారాలు చూపాలని పిటిషనర్‌ను కోరినా స్పందించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలపై పిటిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యల నిమిత్తం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

పోటీలు జరగకపోయినా సర్టిఫికెట్లు..
ఏపీ జూడో అసోసియేషన్‌ నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొందినవారు.. వారు సంపాదించిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను పిటిషనర్‌ పిటిషన్‌లో వివరించారు. పోటీలు జరగకపోయినా జూడోలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్లు ఇచ్చారు. అసలైన జాతీయ, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లతో సంబంధం లేని తేదీలు, వేదికల పేరుతో నకిలీ ఫారమ్‌–2, ఫారమ్‌–4 సర్టిఫికేట్లను సృష్టించారు. టోర్నమెంట్లలో పాల్గొనని, మొదటి రౌండ్లలోనే నిష్క్రమించిన అభ్యర్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించినట్లు నకిలీ రికార్డులను తయారు చేశారు. ఈ నకిలీ పత్రాల ద్వారా స్పోర్ట్స్‌ ప్రాధాన్యత జాబితాలో మొదటి స్థానాలు పొంది, నిజమైన క్రీడాకారుల హక్కులను కాలరాశారు.

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. మెడికల్‌ సీట్లు..
విశాఖపట్నం జిల్లాలో సుమారు 20 మంది నకిలీ జూడో సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు. కె.చందన అనే అభ్యర్థి ఇంటర్‌­–డిస్ట్రిక్ట్‌ జూడో టోర్నమెంట్‌ నకిలీ సర్టిఫికేట్‌తో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా ఎంపికైంది. 
పల్లిపాటి రిత్విక్‌ను 2017 డిసెంబర్‌ లో చెన్నైలో జరిగిన సీనియర్‌ నేషనల్‌ జూడో ఛాంపియన్‌షిప్‌లో 66 కేజీల కేటగిరీలో అనర్హుడిగా ప్రకటించారు. అయినప్పటికీ, ఈ పోటీ ఆధారంగా పొందిన నకిలీ సర్టిఫికేట్‌తో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ స్పోర్ట్స్‌ కోటా సీటు సాధించాడు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జూడో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది. టోర్నమెంట్లలో అనర్హత పొందిన వారికి, కేవలం పాల్గొన్న వారికి ఎటువంటి మెరిట్‌ సర్టిఫికెట్లు జారీ చేయమని స్పష్టంగా చెప్పింది. 

⇒ ఇదే రీతిలో పశుసంవర్థక శాఖలో కూడా పలువురు ఉద్యోగాలు పొందారు. టోర్నమెంట్‌ రికార్డులు, పతకాల ప్రదానోత్సవ వివరాలను పరిశీలించగా, పలువురు అభ్యర్థులు చూపిన సర్టిఫికేట్లు నకిలీవని రూఢీ అయింది. ఆకుమల్ల హర్షవర్ధన్‌ జాతీయ స్థాయి పోటీలలో ఎటువంటి స్థానమూ సాధించకపోయినా, మెరిట్‌ సర్టిఫికేట్‌తో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పి. ఇస్మాయిల్‌ బాషా, పల్లపు అభినయ్, అయితు అప్పలస్వామి, పి. అశ్విని తదితరులు పోటీ రికార్డుల్లో పేర్లు లేకున్నా నకిలీ స్పోర్ట్స్‌ ఫారమ్‌ల ఆధారంగా ఉద్యోగాలు సాధించారు. ఏ టోర్నమెంట్‌ అధికారిక రికార్డులలో లేదా ఎంట్రీ ఫారమ్‌లలో లేదు. అయినా సరే నకిలీ సర్టిఫికేట్ల ద్వారా జాబితాలో చేరి ఉద్యోగం సాధించారు. 

ఇదో పెద్ద కుంభకోణం.. దీని వెనుక కుట్రకోణం..
పోటీలు జరగని తేదీలతో, ఇతర విజేతల స్థానాలను తమ స్థానాలుగా చెప్పుకుంటూ, జూనియర్‌ టోర్నమెంట్లను సీనియర్‌ టోర్నమెంట్లుగా చిత్రీకరిస్తూ సమర్పించిన దరఖాస్తులను జూడో సంఘం కార్యదర్శి పవన్‌ ఎలాంటి పరిశీలన చేయకుండా ఫారమ్‌ 2 సర్టిఫికేట్లు జారీ చేశారు. ఇది ఒక పెద్ద కుంభకోణంలో భాగం. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) లోని అసిస్టెంట్‌ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది ఈ నకిలీ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా ధృవీకరించారు. సమాచార హక్కు చట్టం కింద పాత సమాచారాన్ని కోరినప్పుడు, ఈమెయిల్‌లు, ఇతర ఆధారాలు డిలీట్‌ అయ్యాయని అధికారులు చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. ఏపీ జూడో అసోసియేషన్‌ ప్రతినిధులు వెంకట్‌ నమిశెట్టి, పవన్‌ సందీప్‌ నమిశెట్టి తదితరులు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ఫారమ్‌–2, ఫారమ్‌–4 లను జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలి.’ అని పురుషోత్తం తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

డీఎస్సీలోనూ అవే నకిలీ సర్టిఫికెట్లు..
మెగా డీఎస్‌సీ నోటిఫికేషన్‌ –2025 కింద దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులు జూడో అసోసియేషన్‌ నుంచి సంపాదించిన నకిలీ సర్టి­ఫికేట్లను జతపరిచారు. ఖమ్మం, విజయ­వాడ, గుంటూరులలో జరిగిన టోర్నమెంట్ల పేరుతో సమర్పించిన ధృవీకరణ పత్రాలు అసలు ఫలి­తాల జాబితాతో సరిపోలడం లేదు. జరగని పోటీ­లను జరిగినట్లు చూపడంతో పాటు, పోటీల్లో తాము ఫలానా స్థానం సాధించామని తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందారు. 

⇒ డాకోజి పాండు ఖమ్మంలో జరిగిన సీనియర్‌ జూడో ఛాంపియన్‌షిప్‌లో 2వ స్థానం సాధించినట్లు నకిలీ సర్టిఫికేట్, హామీ పత్రం సమ­ర్పించగా, జూడో అసోసియేషన్‌ కార్యదర్శి పవన్‌ సందీప్‌ దీనికి ఫారమ్‌–2 మంజూరు చేశారు. 
⇒ మిట్నసాల సుధారాణి 52 కేజీల సీనియర్‌ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు వివరాలతో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వగా, 23.05.2025న పవన్‌ సందీప్‌ ఫారమ్‌–2 జారీ చేశారు. 

⇒ దేసావత్‌ చంద్ర నాయక్‌ 66 కేజీల సీనియర్‌ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు హామీ పత్రం ఇవ్వగా,  20.05.2025న పవన్‌ ఫారమ్‌–2 సర్టిఫికేట్‌ ఇచ్చారు. 
⇒ రియాజుల్లా నల్బంది 73 కేజీల సీనియర్‌ విభాగంలో 2వ స్థానం పొందినట్లు తప్పుడు రికార్డు చూపగా, పవన్‌ 20.05.2025న ఫారమ్‌–2 జారీ చేశారు.

⇒ షేక్‌ ఇనామ్‌ హుస్సేన్‌ 73 కేజీల సీనియర్‌ విభాగంలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్‌ చూపారు. ఏ స్థానంలో అయితే తాను విజయం సాధించానని హుస్సేన్‌ చెప్పారో, అధికారిక రికార్డుల ప్రకారం కె.హరికృష్ణ ఆ స్థానాన్ని సాధించినట్లు తేలింది. అయినా సరే హుస్సేన్‌కు పవన్‌ ఫారమ్‌–2 ఇచ్చారు.
⇒ అక్కల సురేఖ 63 కేజీల సీనియర్‌ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు తేదీలతో ఉన్న పత్రాలు ఇవ్వగా, పవన్‌ ఫారమ్‌–2 జారీ చేశారు.

⇒ నొస్సం కరిష్మా  52 కేజీల సీనియర్‌ విభాగంలో 2వ స్థానం పొందినట్లు నకిలీ తేదీల సర్టిఫికేట్‌ సమర్పించగా, జూడో సంఘం కార్యదర్శి నుంచి ఫారమ్‌ 2 సంపాదించారు. 
⇒ హస్వంత్‌ సూర్య నాయక్‌ 66 కేజీల సీనియర్‌ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు రికార్డులతో ఫారమ్‌–2 సర్టిఫికేట్‌ పొందారు. ఇలా పలువురు తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసి వాటి ద్వారా ఉద్యోగాలు పొందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement