2019–24 మధ్య జగన్ పాలనలో 14.15 లక్షల ఇళ్లు మంజూరు
2015–19 మధ్య 4.91 లక్షల ఇళ్లే..
రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు వై.వి.సుబ్బారెడ్డి, రఘునాథరెడ్డి ప్రశ్నలకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)–అర్బన్, పీఎంఏవై–అర్బన్ 2.0 పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు మొత్తం 19,67,971 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి తోఖన్ సాహు తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీనేత, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా 2015 జూన్ 25 నుంచి అమలవుతున్న పీఎంఏవై–అర్బన్ పథకాన్ని 2024 సెపె్టంబర్ 1 నుంచి పీఎంఏవై–అర్బన్ 2.0గా విస్తరించినట్లు చెప్పారు.
ఈ పథకాల కింద ఏపీకి మంజూరైన 19.68 లక్షల ఇళ్లల్లో ఇప్పటివరకు 11.38 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, వీటిలో 10.75 లక్షల ఇళ్లల్లో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదలలో జాప్యం, మౌలిక వసతుల కల్పన ఆలస్యం, లబ్దిదారులు తమ వాటా నిధులు సమకూర్చుకోవడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా అమలు వేగం తగ్గిందని చెప్పారు.
పీఎంఏవై–అర్బన్ 2.0 కింద 61,084 ఇళ్లు
2024 సెప్టెంబర్ 1 నుంచి పీఎంఏవై–అర్బన్ 2.0గా విస్తరించిన ఈ పథకం కింద ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు 61,084 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. అమరావతి భూసమీకరణ రైతులను పీఎంఏవై–అర్బన్ 2.0 లబ్ధిదారులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ హయాంలోనే అత్యధిక ఇళ్ల మంజూరు, నిర్మాణం
వైఎస్సార్‌సీపీ హయాంలోనే అత్యధికంగా ఇళ్లు మంజూరై, నిర్మాణం జరిగినట్లు కేంద్ర గణాంకాల ద్వారా వెల్లడైంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ పాలన కాలంలో మొత్తం 14,15,800 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకాల కింద చంద్రబాబు పాలనలో 2015–19 మధ్య 4,91,087 లక్షల ఇళ్లు, 2024–27 (ప్రస్తుత సంవత్సరం) 61,578 మంజూరయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వాల హయాంలో మొత్తం 5,52,171 లక్షల ఇళ్లకు ఆమోదం లభించినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి.


