సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పష్టీకరణ
ఆందోళన చేస్తున్నారనే కారణంతో లాఠీచార్జ్ చేయరాదు
దాడుల్లో పోలీసులు కూడా గాయపడ్డారు
వీరి తరపున కూడా వాదనలు వినేందుకు ధర్మాసనం అంగీకారం
అన్ని పిటిషన్లపై నేడు సీజేఐ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన తెలపడం దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆందోళన జరుగుతోందనే ఒకే కారణంతో పోలీసులు, ఇతర భద్రతాధికారులు లాఠీచార్జ్‌కు పాల్పడటం సరికాదని సీజేఐతోపాటు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌లతో జంతర్‌మంతర్‌లో జరిగిన ఆందోళనలపై పోలీసులు లాఠీఛార్జ్ తదితర బల ప్రయోగానికి పాల్పడటంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లు అన్నింటినీ కలిపి మంగళవారం విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.
అది రాజ్యాంగ హక్కు
విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ‘‘జంతర్ మంతర్ ఆందోళనల్లో పోలీసులు అతిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉంటే వాటిపై స్వతంత్ర విచారణ జరగాలి. ఇది కేవలం ఢిల్లీకి పరిమితమైన సమస్య కాదు. నిరసనలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పోలీసు ప్రోటోకాల్ అవసరం. ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణ అంతర్భాగం’ అని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తి ప్రాణం చాలా విలువైందని స్పష్టం చేశారు. జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ మాట్లాడుతూ ‘‘పోలీసులు, విద్యార్థుల్లో ఎవరు గాయపడ్డా సమానంగానే చూడాలి. నిరసన ప్రదర్శనలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి రావచ్చు’’ అని అన్నారు. నిరసనల సందర్భంగా గాయపడ్డ పోలీసు సిబ్బంది కుటుంబాలు తమ వాదన కూడా వినిపించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ న్యాయస్థానానికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.


