లక్షలాది మంది భారతీయులకు ఇష్టమైన వంటకం బిర్యానీ. సందర్భం ఏదైనా బిర్యానీ ఒక ఎమోషన్. అయితే ఒక ప్లేట్ బిర్యానీ చివరకు కోర్టు కేసు వరకు వెళ్తుందని ఎవరైనా ఊహిస్తారా? దీనికి సంబంధించి పుదుచ్చేరిలో జరిగిన ఒక విచిత్రమైన విషయం నెట్టింట సందడిగా మారింది.
‘లైవ్‌లా’ (LiveLaw) నివేదిక ప్రకారం. స్థానిక రెస్టారెంట్‌లో పి. సుందరకుమార మణికందన్ అనే వినియోగ దారుడు తన స్నేహితుడు మహమ్మద్ నియాజుద్దీన్‌తో పుదుచ్చేరి ఎంజీ రోడ్డులోని ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ చేసి తింటూ ఉండగా, బిర్యానీలో చనిపోయిన పురుగు కనిపించింది. దీని తీవ్రతను గమనించిన అతను వీడియోలు, ఫోటోలు తీశారు. రెస్టారెంట్‌లో పరిశుభ్రత లోపించిందని, దీనివల్ల తనకు మానసిక ఆందోళన కలగడమే కాకుండా, ఆరోగ్యం పాడవుతుందనే భయం, హోటళ్లపై నమ్మకం పోయిందని ఆరోపించాడు.
ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్
ఆ తర్వాత, మణికందన్ ఆ రెస్టారెంట్‌కు లీగల్ నోటీసు జారీ చేశారు. నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన , న్యాయపరమైన ఖర్చులను పేర్కొంటూ, అతను రూ. 1.3 లక్షల పరిహారం కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో పుదుచ్చేరిలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్ విఫలమైందని, ఇది ‘వినియోగదారుల రక్షణ చట్టం, 2019’ కింద సేవా లోపమేనని ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో రెస్టారెంట్ చేసిన ఒక పెద్ద తప్పు వారికి మైనస్ అయింది. కోర్టు నుంచి నోటీసులు అందినప్పటికీ 'బిర్యానీ అండ్ కో' ప్రతినిధులు కమిషన్ ముందు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును కోర్టు ఏకపక్షంగా విచారించింది. కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అంత స్పష్టంగా లేకపోయినా, వీడియో ఫుటేజీని కమిషన్ నిశితంగా పరిశీలించింది. ఆ వీడియోలో బిర్యానీలో చనిపోయిన ఈగ లాంటి పురుగు స్పష్టంగా కనిపించింది. అలాగే గూగుల్ రివ్యూలో కస్టమర్ పెట్టిన పోస్టుకు రెస్టారెంట్ మొదట స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పి, ఇలాంటివి మళ్లీ జరగవని పేర్కొంది. కానీ లీగల్ నోటీసుకు ఇచ్చిన రిప్లైలో మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించింది. ఈ పరస్పర విరుద్ధమైన సమాధానాల వల్ల రెస్టారెంట్ నమ్మకాన్ని కోల్పోయిందని కమిషన్ అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త
వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటళ్లకు ఉందని స్పష్టం చేసింది. కస్టమర్‌కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకపోయినప్పటికీ, ఈ ఘటన వల్ల ఆయన మానసిక వేదనకు, ఇబ్బందులకు గురయ్యారని కోర్టు అంగీకరించింది. దీని ప్రకారం వినియోగదారుడి మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులకుగానూ కస్టమర్‌కు 10వేల రూపాయలు,కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ. 3,000 ఇవ్వాలని చెల్లించాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది.
అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన విషయం మరొకటి ఉంది. ఈ నగదు పరిహారంతో పాటు, ఫిర్యాదు దారుడికి 10 ప్లేట్ల హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలంటూ వినూత్న ఆదేశాలు జారీ చేసింది. ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున ఈ బిర్యానీని అందించాలని, అది కూడా పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉచిత బిర్యానీ పంపిణీ కోర్డు ఆర్డర్ అందిన రెండు వారాల్లోగా ప్రారంభం కావాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: హాట్ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా


