బిర్యానీ భోజనంబు... | World Biryani Day is celebrated on 5th July | Sakshi
Sakshi News home page

బిర్యానీ భోజనంబు...

Jul 5 2026 3:43 AM | Updated on Jul 12 2026 3:17 PM

World Biryani Day is celebrated on 5th July

నేడు బిర్యానీ డే

కరోనా కాలంలో, లాక్‌డౌన్‌ కష్టకాలంలో ఒక భక్తుడు నర్సాపూర్‌ అడవుల్లోకి వెళ్లి తపస్సు చేశాడట. దేవుడు ప్రత్యక్షమై... ‘మణులు కావాలా? మాణిక్యాలు కావాలా? బంగారు గనులు కావాలా?’ అని అడిగాడు. ‘అవన్నీ నాకెందుకు స్వామీ... వేడి వేడి బిర్యానీ కావాలి. ఈ కరోనా పుణ్యమా అని బిర్యానీ తినక రెండు నెలలు అవుతోంది’ అన్నాడట ఆ భక్తుడు. ఇది జోకే కావచ్చుగానీ బిర్యానీ అభిమానుల వీరాభిమానం గురించి చెప్పే జోకు. ఈరోజు బిర్యానీ డే. ‘నాకు ప్రతిరోజూ బిర్యానీ డేనే’ అనేవాళ్లు ఉంటారనేది వేరే విషయంగానీ ఈ సండే వేడి వేడిగా బిర్యానీ కుబుర్లు చెప్పుకుందాం...

అలనాటి బెరియనే... నేటి బిర్యానీ!
బిర్యానీకి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దీని మూలాలు మెసొ పొటేమియాలోని ప్రాచీన నాగరికతలో ఉన్నాయి. ఆ కాలంలో ‘బెరియన్‌’ అని పిలిచేవారు.
‘బిర్యానీ’ అనేది పర్షియన్‌ పదం ‘బిర్యాన్‌’ నుండి వచ్చింది. దీని అర్థం... వండడానికి ముందు వేయించినది.
మొఘల్‌ రాజుల కాలంలో బిర్యానీకి ప్రాచుర్యం వచ్చి ప్రజాదరణ  పొందింది. సామాన్యుల నుంచి చక్రవర్తుల వరకు రకరకాల బిర్యానీ రుచులను ఇష్టంగా ఆస్వాదించేవారు.

ఎన్నో బిర్యానీలు... వాటిలో కొన్ని...
బంగాళదుంపలను ఉపయోగించి చేసే బిర్యానీ... కల్‌కత్తా బిర్యానీ. ఆహార కొరత సమయంలో బియ్యాన్ని  పొదుపుగా వాడేందుకు వచ్చిన వంటకమే ఈ కల్‌కత్తా బిర్యాని.
కేరళలో తలస్సేరి  బిర్యానీ ఫేమస్‌.
తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో అంబూర్‌ బిర్యానీ ఫేమస్‌. అంబూర్‌ అనే సిటీలో పుట్టిన బిర్యానీ ఇది.
జపాన్‌లో ‘సుషీ బిర్యానీ’ మెక్సికోలో ‘క్వెసడిల్లో బిర్యానీ’లు రుచికరమైన క్రియేటివ్‌ బిర్యానీలుగా పేరు తెచ్చుకున్నాయి.

బిర్యానీ అండ్‌ అజిత్‌
హీరో అజిత్‌కు బిర్యానీ అంటే చాలా ఇష్టం. తాను తినడమే కాదు ఇతరులతో తినిపించడం అంటే కూడా ఇష్టం. షూటింగ్‌లలో ఆయనే స్వయంగా బిర్యానీ చేసి అక్కడున్న వాళ్లకు వడ్డించిన సందర్భాలు ఉన్నాయి. అజిత్‌కు బిర్యానీపై ఉన్న అంతులేని ఇష్టానికి ముగ్ధుడైన దర్శకుడు వెంకట్‌ ప్రభు తాను తీసిన బ్లాక్‌ కామెడీ సినిమాకి ‘బిర్యానీ’ అని పేరు పెట్టాడు.

బిర్యానీ బుక్‌
బిర్యానీపై నోరూరించే పుస్తకాలు ఎన్నో వచ్చాయి.    అందులో ఒకటి ప్రతిభా కరణ్‌ రాసిన... బిర్యానీ.
బిర్యానీ ఫ్లాష్‌బ్యాక్‌తో పాటు నారింజ పండ్లతో చేసే బిర్వానీ, రోజ్‌ బిర్యానీ, కబాబ్‌ బిర్యానీలాంటి అరుదైన పాతకాలపు బిర్యానీలను పరిచయం చేశారు.

హైదరాబాద్‌లో ప్రసిద్ధి  పొందిన దూద్‌ బిర్యానీ( పాలతో చేసే బిర్యానీ), కీమా బిర్యానీ, బటేర్‌ బిర్యానీ... మొదలైన బిర్యానీ  రకాల గురించి చె΄్పారు.
తమిళనాడులో ప్రసిద్ధి  పొందిన సేలం, అంబూర్, దిండిగల్‌...మొదలైన బిర్యానీలను కూడా పరిచయం చేశారు. కేరళలో రొయ్యలు, కరివే పాకు, సోంపుతో తయారుచేసే రొయ్యల బిర్యానీ, అనాస పువ్వులతో చేసే మటన్‌ బిర్యానీల గురించి చె΄్పారు. వెనిగర్, ఆలివ్‌ ఆయిల్‌ను ఉపయోగించి చేసే గోవా బిర్యానీ, చేపలు, ఆవాలు ఉపయోగించే చేసే బెంగాలి స్టైల్‌ బిర్యానీలు, అస్సాం బిర్యానీలు... ఇలా ఎన్నెన్నో బిర్యానీలు పుస్తకంలో నోరూరిస్తాయి.

నవాబ్‌బాయ్‌ బిర్యానీ
దిల్లీలో జరిగిన నేషనల్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు వేడి వేడి బిర్యానీ వడ్డించాడు నవాబుద్దీన్‌. ఎన్నో సంవత్సరాలుగా షూటింగ్‌ స్పోర్ట్స్‌లో పాల్గొనే ఆటగాళ్లకు బిర్యానీ వడ్డిస్తున్న నవాబ్‌ భాయ్‌ ఒకప్పుడు షూటర్‌. ఎంతోమంది షూటర్‌లకు ఆయన వడ్డించే బిర్యానీ అంటే ఇష్టం. ఈ బిర్యానీ ‘నవాబ్‌ భాయ్‌ బిర్యానీ’గా ప్రసిద్ధి  పొందింది.

మోస్ట్‌ గూగుల్డ్‌!
‘మోస్ట్‌ గూగుల్డ్‌ డిష్‌’గా 2022లో స్థానం సం పాదించింది బిర్యానీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement