మహమ్మారి లాంటి కేన్సర్ వ్యాధులు మనుషులకు ఎలాంటి ఛాలెంజ్‌లు విసురుతాయంటే..తట్టుకుని నిలబడనివ్వకుండా ఏడిపించేస్తాయ్. ఒక్కోసారి ఆ క్రమంలో అవయవాలను కోల్పోయేలా చేసి వికృతంగా నవ్వుతుంది. అయినా సరే లేచి నిలబడి బతికి చూపించే వారియర్లు కొందరే. అలాంటి ధీర వనితే ఈ అమ్మాయి. ఆ మహమ్మారి కేన్సర్ ఆమె జీవితాన్ని అంధకారం చేసినా..మనసుతో రంగులను సృష్టించి ప్రపంచమే నివ్వెరపోయేలా ఫ్యాషన్ రంగంలో సత్తా చాటుతోంది.
ఆ అమ్మాయే ఛత్తీశ్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కి చెందిన ఆష్కా సునీల్ గోయల్. ఐదోతరగతి చదువున్నప్పుడు.. ఒకరోజు పాఠశాలలో పరీక్ష రాస్తుండగా అత్యంత భయంకరగా అనిపించి వాష్‌రూమ్‌కి పరుగెత్తింది. అంతే సింక్ దగ్గరకు కూడా రాకమునుపు రక్తపు వాంతులు దాంతో టీచర్లు ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడమే గాక తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు పరీక్షలు చేసి.. ఆమె నాసికా కుహరంలో ఒక అరుదైన ట్యూమర్ (కేన్సర్)ను గుర్తించారు. ఇది చివరిదశ కేన్సర్ అని, ఆమె ఎక్కువ రోజులు బతకదని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత ఆ ట్యూమర్ క్రమంగా ఆమె కంటి నరాలను దెబ్బతీయడం ప్రారంభించింది.
చికిత్స కోసం ముంబై వెళ్తుండగా..
చికిత్స కోసం ఆష్కా కుటుంబం రాయ్‌పూర్ నుంచి చెన్నై, ముంబై నగరాలలోని ఆస్పత్రులు చుట్టూ తిరిగింది. ఎక్కడికి వెళ్లినా చాలా కష్టం, సర్జరీ చేయడం సాధ్యం కాదు అని చేతులెత్తేసేవారు వైద్యులు. ఇక చేసేదేమి లేక ముంబై నుంచి తిరిగి విమానంలో వస్తుండగా నాన్న నాకేం కనిపించడం లేదు అంత చీకటిగా ఉంది అని చెప్పింది ఆష్కా. అంతే చూస్తుండగానే ఆమె రెండు కళ్లు చూపుని కోల్పోయాయి.
ప్రశాంతంగా చనిపోనివ్వండి..
ఆష్కా బతికే అవకాశాలు తక్కువగా ఉండటంతో ‘ఆమె ఎలాగూ బతకదు, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం దండగా అంటూ బంధువులంతా సలహాలివ్వడం మొదలు పెట్టారు ఆష్కా తల్లిదండ్రులకు. ఆమెను ప్రశాంతంగా చనిపోనివ్వండి ఇలా చికిత్సలతో కష్టపెట్టొద్దని చెప్పేవారు. అయితే ఆమె మామయ్య మాత్రం చాలు ఆపండి, ఆమెను ఎలాగైనా.. బతికించుకుంటాం అందుకోసం ఏమైనా చేస్తాం అంటూ అందరిలో స్థైర్యాన్ని నింపాడు. అలా ఆయన ఇచ్చిన ధైర్యంతో ఆమె కేన్సర్ చికిత్స మొదలైంది. కానీ కీమోథెరపీ రేడియేషన్ వల్ల ఆమె నోరు, గొంతు దెబ్బతిన్నాయి.కనీసం చుక్క నీరు తాగలేక విలవిల్లాడేది. పొడవైన జుట్టంత రాలిపోతుండేది ఆమెకు.
అద్భుతం చేసినట్లు బతికిబట్టకట్టింది..
చివరకు డాక్టర్లు ధైర్యం చేసి శస్త్ర చికిత్స చేసి ఆ కణితిని తొలగించారు. అయితే ఆష్కాకు చూపు మాత్రం రాలేదు. అలా రెండేళ్లు చికిత్సల కోసం ఆస్పత్రలు చుట్టూ తిరగడంతో..మళ్లీ పుస్తకాలు చేతపట్టి చదువే సరస్వంగా అహర్నిశలు కష్టపడి చదివింది. అలాగే కంటి చూపుని కోల్పోవడంతో టెక్నాలజీ వైపుకి వెళ్లగలనా అనుకుంది. కానీ అవి కూడా చాకచక్యంగా చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంది. అందుకు కారణం తన తల్లిదండ్రులేనని సగర్వంగా చెబుతోంది.
తన తల్లి నువ్వు భిన్నంగా ఒక పనిచేయగలవు అంటూ ఇచ్చిన ప్రోత్సహంతోనే ఇదంతా సాధ్యమైందని అంటోంది. అదీగాక తన పేరెంట్స్ తాము పెద్ద చదువులు ఎలాగో చదువకోలేకపోయాం, అందువల్ల నువ్వు బాగా చదువుకోవాలని చెబుతుండేవారు. అదే తనను చదువుపై ఫోకస్ పెట్టేలా చేసిందని చెప్పుకొచ్చింది. అయితే ష్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకున్నానని చెప్పగానే..చూపేలేని నీవు ఫ్యాషన్‌లో ఎలా రాణించగలవు అంటూ మళ్లీ ప్రశ్నలు ఎదురయ్యాయి ఆష్కాకి.
మనసుతో రంగుల ప్రపంచాన్ని సృష్టించింది..
ఫ్యాషన్ అంటే కేవలం కళ్లతో చూసే రంగులు మాత్రమే కాదు.. అది స్పర్శ, అనుభూతి అని ఆష్కా నమ్మింది. వస్త్రధారణ, బట్టల నిర్మాణం ఆధారంగా డిజైన్లను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. బట్టలపై గుర్తులు పెట్టడానికి ప్రత్యేక మార్కర్లు, సేఫ్టీపిన్‌లను ఉపయోగించే సరికొత్త పద్ధతులను కనిపెట్టింది. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థ అయిన ‘లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్’లో చదవాలనేది ఆమె కల.
అయితే తల్లిదండ్రలు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకుంటే పంపిస్తామని షరతు పెట్టారు. అలా ఆమె ముంబై నగరం వెళ్లి అక్కడ చేతికర్ర సాయంతో ఒంటిరిగా బతికి చూపించి..లండన్ వెళ్లి ఫ్యాషన్ కోర్సు చదవాలనే కలను నెరవేర్చుకుంది.
ప్రపంచమే నివ్వెరపోయేలా..ర్యాంప్ వాక్ చేసింది..
అలా ఆమె 22 ఏళ్ల వయసులోనే ఆష్కా ‘లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్’లో సీటు సాధించి.. బీఎస్సీ ఆనర్స్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసింది. అంతేగాదు తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించి.. ప్రపంచ ప్రఖ్యాత ‘లండన్ ఫ్యాషన్ వీక్’ వేదికపై తన డిజైన్లను ప్రదర్శించడమే కాకుండా సగర్వంగా ర్యాంప్‌వాక్ చేసింది. దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ చేతుల మీదుగా ‘ఇన్విన్సిబుల్ స్పిరిట్ అవార్డు’, బ్రిటన్ పార్లమెంటులో ‘ఇన్‌స్పైరింగ్ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకుని దేశకీర్తిని పెంచింది.
పైగా తనను ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా చూడొద్దని అంటున్నారు. తను ఎవరినో ప్రభావితం చేయడానికి కాదని ప్రపంచ దృక్పథాన్ని మార్చడానికి ఉన్నానంటోంది. అంతేగాదు చూపులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే మాటలు వద్దు..అంతకుమించి సమస్యలు ఈ ప్రపంచంలో ఉన్నాయని మర్చిపోకండని అంటోంది ఆష్కా. తనలాంటి దివ్యాంగులు అన్ని చేయగలరు అని విశ్వసించండి తప్ప తేలిక చసి చూడొద్దు అని గట్టి వార్నింగ్ ఇస్తోంది ఆష్కా.
(చదవండి: రెండుసార్లు జేఈఈ ఫెయిల్..కానీ ఇవాళ నెలకు రూ. 2 లక్షలు)


