సోదరుడిని కాపాడుకోవాలనే తపనతో ఒక వ్యక్తి అతడిని ఏకంగా 150 సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. వైద్యుల సలహా మేరకు అలా చేశాడు. అదేంటి అనుకుంటున్నారా? అయితే నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌కి చెందిన 21 ఏళ్ల అరుణ్‌ని అత్యంత విషపూరితమైన పాము కాటు వేసింది. నీళ్లు తెచ్చుకోవడానికి పొలానికి వెళ్లినపుడు గడ్డి బస్తాను పైకి లేపుతుండగా, అందులో దాగి ఉన్న పాము అతన్ని కాటు వేసింది.దీంతో అతడు గట్టిగా కేకలు వేశాడు. క్రమంగా అతని పరిస్థితి విషమంగా మారిపోతోంది. అరుణ్ అరుపులు విన్న అతని అన్నయ్య ఆకాష్ వెంటనే అక్కడికి చేరుకుని, అతన్ని రోడ్డు వైపు తీసుకువెళ్లాడు. అరుణ్ పరిస్థితి మరింత క్షీణించడంతో అంబులెన్స్ ,పోలీసులకు సమాచారం అందించారు.
మరోవైపు అరుణ్ పరిస్థితి తీవ్రతను గమనించిన ఒక మెడికల్ స్టోర్ యజమాని, ఆ సోదరులిద్దరినీ తన మోటార్‌సైకిల్‌పై మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడు. మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ విభాగంలో, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ (EMO) డాక్టర్ షేర్ సింగ్, ఆయన బృందం వెంటనే చికిత్స ప్రారంభించారు.రెండు గంటల వ్యవధిలో 15 డోసుల యాంటీ-వెనం (విష విరుగుడు మందు) ఇచ్చారు, ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఆ సమయంలో అతణ్ణి నిద్రపోనివ్వకుండా చూడాలని, మెలకువగా ఉంచాలను వైద్యులు సూచించారు. దీంతో ఆకాష్ తన సోదరుడి పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే, అతనిపై నీళ్లు చల్లుతూ, అరుణ్‌ని 150 సార్లకు పైగా చెంపదెబ్బలు కొడుతూ అతణ్ణి మెలకువతో ఉండేలా కాపాలా కాశాడు.
ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య
పాము కాటు కేసుల్లో సాధారణంగా ఐదు డోసుల యాంటీ-వెనం ఇస్తామని డాక్టర్ షేర్ సింగ్ తెలిపారు. అయితే, అరుణ్‌పై విష ప్రభావం తీవ్రంగా ఉండటంతో, రెండు గంటల వ్యవధిలో మొత్తం 15 డోసుల యాంటీ-వెనం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అరుణ్ ప్రాణాలను కాపాడటంలో సహాయపడినందుకు కుటుంబ సభ్యులు వైద్యులకు , మెడికల్ స్టోర్ యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
నోట్ : పాము కాటుకు గురైనప్పుడు వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. సాధ్యమైనంత త్వరగా యాంటి వెనమ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. ఆందోళన,భయం అస్సలు మంచిది కాదు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం


