అఖిలేశ్‌ డుమ్మా.. ఏ కోణంలో చూసినా అలకే! | Akhilesh Yadav Skips INDIA Bloc Meet Amid SP-Congress Seat-Sharing Differences In UP, Is Absence A Message To Congress? | Sakshi
Sakshi News home page

అఖిలేశ్‌ డుమ్మా.. ఏ కోణంలో చూసినా అలకే!

Sep 30 2026 12:58 PM | Updated on Sep 30 2026 1:32 PM

Akhilesh Yadav Skips INDIA Bloc Meet: Absence a Message to Congress

కేంద్ర ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్‌ అంశాలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు ఇండియా కూటమి కీలక నేతలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ హాజరుకాలేదు. ఈ గైర్హాజరు ఇప్పుడు హస్తిన రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అఖిలేశ్‌ కావాలనే ఈ సమావేశానికి దూరంగా ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిలేశ్‌ కీలక సమావేశానికి గైర్హాజరు కావడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. కూటమిలో సీట్ల లెక్కలు తేలకముందే కాంగ్రెస్‌కు తన అసంతృప్తిని పరోక్షంగా తెలియజేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సీట్ల లెక్కపై పేచీ..
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కనీసం 150 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ ప్రకటించారు. మొత్తం 403 స్థానాల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నామని ఆయన చెప్పారు. మరోవైపు ఎస్పీ మాత్రం కాంగ్రెస్‌కు సుమారు 85–90 స్థానాల వరకు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాయ్‌బరేలీ, అమేథీ పరిధిలోని కొన్ని స్థానాల విషయంలోనూ ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

అయితే ఎస్పీ మాత్రం కాంగ్రెస్‌తో విభేదాలు లేవనే అంటోంది.  అఖిలేశ్‌ గైర్హాజరుకు రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియే కారణమని ఎస్పీ చెబుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారని తెలిపింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా అఖిలేశ్‌తో మాట్లాడానని, నామినేషన్‌ ప్రక్రియ కారణంగానే ఆయన వ్యక్తిగతంగా సమావేశానికి రాలేకపోయారని చెప్పారు. 

రియాక్షన్‌ మరీ ఇలాగనా?
కానీ, అఖిలేశ్‌ స్థానంలో ఎస్పీకి చెందిన ప్రముఖ నేతలు ఇండియా కూటమి సమావేశానికి రాలేదు. మొహిబుల్లా నద్వీ, హరేంద్ర మాలిక్‌ లాంటివాళ్లను సమావేశానికి పంపడం కూడా చర్చకు దారితీసింది. దీంతో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌ నుంచి వస్తున్న ఒత్తిడికి అఖిలేశ్‌ తనదైన రీతిలో స్పందిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ మసూద్‌ కూడా అఖిలేశ్‌ కూటమి సమావేశానికి దూరంగా ఉండటంపై వ్యాఖ్యలు చేశారు. కూటమికి నాయకత్వం వహించాలంటే అఖిలేశ్‌ మరింత విశాల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఎస్పీ వర్గాల్లో ఇప్పుడు అసంతృప్తికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఇండియా కూటమి సమావేశంలో ఎస్‌ఐఆర్‌, ఎన్నికల సంఘంపై ఉమ్మడి కార్యాచరణ, తదుపరి ఆందోళనలపై చర్చ జరిగింది. అఖిలేశ్‌ గైర్హాజరుతో పాటు డీఎంకే, ఆప్‌ వంటి పార్టీల దూరం నేపథ్యంలో కూటమి అంతర్గత సమన్వయంపై చర్చ మొదలైంది.

ఇదీ చదవండి: సీఈసీపై ‘ఇండియా’ కూటమి సమరశంఖం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement